అవును చైనా ఆక్రమించింది: లద్దాఖ్ ఎంపీ

గత కొద్ది రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమయ్యారు.... 

Published : 11 Jun 2020 01:18 IST

దిల్లీ: గత కొద్ది రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌లోని భారత్‌ భూభాగాన్ని చైనా ఆక్రమించిందా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించారు. రాహుల్ ట్వీట్‌పై లద్దాఖ్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ స్పందించారు. కాంగ్రెస్‌ హయాంలోనే చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించుకుందని, ఇందుకు తగిన ఆధారాలు అంటూ పలు సందర్భాల్లో చైనా ఆక్రమించిన ప్రదేశాలను సూచిస్తూ ఫొటో, దానికి సంబంధించిన వివరాలను షేర్‌ చేశారు.  

‘‘రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీలు నేను ట్వీట్‌లో పేర్కొన్న ఆధారాలతో అంగీకరిస్తారని భావిస్తున్నాను. ఇక మీదట వారు అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించరని అనుకుంటున్నా’’ అని జమ్యాంగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందులో ఆయన రాహుల్ గాంధీ ప్రశ్నకు బదులిస్తూ ‘‘అవును చైనా భారత్‌ను ఆక్రమించింది. 1962లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 37 వేల చదరపు కిలోమీటర్ల ఆక్సాయి చిన్‌ భూభాగాన్ని, 2008 యూపీఏ పాలనలో చుమూర్‌లోని టియా పాంగ్‌నాక్‌‌, ఛాబ్జి వ్యాలీ ప్రాంతాలను ఆక్రమించింది. దెమ్‌చోక్‌లోని జోరావర్‌ ఫోర్ట్‌ను 2008లో పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నాశనం చేసింది. ఆ ప్రాంతంలో పీఎల్‌ఏ 2012లో పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, కొత్తగా చైనీస్‌ దెమ్‌చోక్‌ కాలనీ పేరుతో 13 సిమెంట్ ఇళ్లు నిర్మించింది. ఈ రెండు ఘటనలు కూడా యూపీఏ హయాంలోనే జరిగాయి. 2008-2009 యూపీఏ పాలనలో భారత్ దుంగ్తి, దెమ్‌చోక్‌ మధ్య ఉన్న పురాతన వ్యాపార కేంద్రం డూమ్ చిలీని కూడా కోల్పోయింది’’ అని అందుకు సంబంధించిన ప్రదేశాలను సూచిస్తూ ఫొటోను  జోడించారు. 

జమ్యాంగ్ ట్వీట్‌ తర్వాత బుధవారం రాహుల్‌ గాంధీ మరో మారు ప్రధాని నరేంద్ర మోదీపై ట్విటర్‌లో విమర్శలు చేశారు.‘‘చైనీయులు లద్దాఖ్‌లోని మన భూభాగంలోకి ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కానీ ప్రధాని మాత్రం దీనిపై మౌనంగా ఉన్నారు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మంగళవారం తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయ ప్రాంతంలో మూడు చోట్ల చైనా తన బలగాలను వెనక్కి తీసుకుంది. ప్రతిగా భారత్‌ కూడా ఆయా ప్రాంతాల్లో తన సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను మరింత తగ్గించేందుకు బుధవారం మరోసారి ఇరు దేశాలకు చెందిన మేజర్‌ జనరల్ స్థాయి అధికారులు చర్చలు జరపనున్నారు.   

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని