శాంతియుతంగా భారత్‌-చైనా చర్చలు

భారత్-చైనాల మధ్య తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుకు సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభనను సైనిక, దౌత్యపరమైన ఒప్పందాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు...

Published : 12 Jun 2020 01:03 IST

దిల్లీ: భారత్-చైనాల మధ్య తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుకు సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభనను సైనిక, దౌత్యపరమైన ఒప్పందాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు భారత్‌ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఒక ప్రకటన చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతతను నెలకొల్పుతూ..రెండు దేశాలకు చెందిన నాయకుల మార్గదర్శకాల మేరకు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరువర్గాలు అంగీకరించాయని తెలిపారు.

గాల్వాన్‌ వ్యాలీ నుంచి ఇరు దేశాలకు చెందిన సైనిక బలగాల ఉపసంహరణకు గల కారణాలపై స్పందించేందు మాత్రం ఆయన నిరారకరించారు. ‘‘జనవరి 6న భారత్-చైనాకు చెందిన ముఖ్య కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడి సైనిక, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు పరిస్థితులపై చర్చించారు. ఇరు దేశాల నాయకుల మార్గదర్శకాలకు అనుగుణంగా గతంలో మాదిరిగానే సైనిక, ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇది ఎంతో అవసరం’’ అని శ్రీవాస్తవ తెలిపారు.   

మంగళవారం గాల్వాన్‌ వ్యాలీలో 14, 15 గస్తీ కేంద్రాల నుంచి ఇరు దేశాలు తమ బలగాలను ఉపసహరించుకున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. గత నెలలో లద్దాఖ్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో చైనా బలగాలు భారత్ సైనికులు గస్తీ నిర్వహించకుండా అడ్డుకోడంతో వివాదం రాజుకుంది. ఉద్రిక్తలు పెంచేలా చైనా పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించడంతో భారత్ కూడా భారీగా తన బలగాలను ఆ ప్రాంతంలో మోహరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని