భారత్ డీఎన్‌ఏను అర్థం చేసుకున్నా: రాహుల్ 

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని శుక్రవారం కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.

Updated : 12 Jun 2020 14:53 IST

దిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని శుక్రవారం కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మరోవైపు ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి దేశం కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూఎస్ మాజీ దౌత్యవేత్త నికొలస్‌ బర్న్స్‌తో జరిపిన సంభాషణలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కఠినమైన లాక్‌డౌన్‌ను విధించింది. ఫలితాలు అందరు చూస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇలాంటి నాయకత్వం చాలా విఘాతం కలిగిస్తోంది. దీనిపై మేం పోరాటం చేస్తున్నాం. నేను నా దేశ డీఎన్‌ఏను అర్థం చేసుకున్నాను కాబట్టి ఆశాజనకంగా ఉన్నాను. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ డీఎన్‌ఏ ఒకే రకంగా ఉంది. దాన్ని మార్చలేరు. కొవిడ్ 19 కారణంగా ఇప్పుడు మేం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. అయితే ఈ సంక్షోభ సమయంలో కూడా కొత్త ఆలోచనలు బయటకు వస్తున్నాయి. గతంలో కంటే ప్రజలు ఒకరికొకరు సహకరించుకోవడాన్ని చూశాను’ అని రాహుల్ అనకొచ్చారు.

కాగా, కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచం అధికార సమతౌల్యాన్ని ఎలా పరిరక్షిస్తుందని ఈ సందర్భంగా నికొలస్‌ను రాహుల్ ప్రశ్నించారు. ‘వాతావరణ మార్పులు వంటి తదితర అంశాలపై ప్రపంచ దేశాలు రాజకీయ శత్రుత్వాన్ని పక్కనపెట్టబోతున్నాయి. ఎందుకంటే అది అందరి ఉనికికి సంబంధించినది. ఆ అంశాలే మనల్ని ఏకం చేస్తాయి. దేశాల మధ్య పోటీతత్వం ఉన్నప్పటికీ ప్రజల తరఫున కలిసి పనిచేయవచ్చు. అయితే కొవిడ్‌ నుంచి బయటకు వచ్చిన తరవాత అంతర్జాతీయ సమాజంగా బాధ్యత తీసుకోగలమా? కలిసి పనిచేయగలమా? అనేది అతి పెద్ద సవాలని నేను అనుకుంటున్నాను’ అని తన అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే చైనా గురించి ప్రస్తావించారు. ‘చైనా ప్రగతి సాధిస్తోంది. అందులో అనుమానం లేదు. కానీ, భారత్, అమెరికా వంటి దేశాలకు ఉన్న సౌలభ్యం అక్కడ ఉండదు. ప్రజలను భయంతో అదుపుచేస్తోంది. హాంకాంగ్‌లో ఏం జరిగిందో చూశాం. అందుకే భారత్, అమెరికా భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ఉన్నాను’ అని నికొలస్‌ వెల్లడించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో..రాహుల్ వివిధ అంశాలపై పలువురు అంతర్జాతీయ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు.

ఇవీ చదవండి:

100కోట్లు దాటనున్న పేదల సంఖ్య!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని