ఆక్సిజన్‌ అందని పరిస్థితులు తలెత్తుతాయ్‌!

కరోనా వైరస్ ప్రభావం కేవలం శ్వాసవ్యవస్థకు మాత్రమే పరిమితం కాలేదు.

Updated : 12 Jun 2020 23:57 IST

వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రభావం కేవలం శ్వాసవ్యవస్థకు మాత్రమే పరిమితం కాలేదు. దాని వల్ల నాడీ వ్యవస్థకు కూడా ముప్పు ఉందని, తలనొప్పి, మూర్ఛ, ఏకాగ్రత దెబ్బతినడం, రుచి, వాసన, కండరాల నొప్పి వంటి తదితర లక్షణాలు కనిపించాయని ఆనల్స్‌ న్యూరాలజీలో ప్రచురితమైన ఓ పరిశోధన వెల్లడిచేస్తోంది.  వైరస్‌ బారిన పడిన దాదాపు సగం మందిలో ఈ లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 

వైరస్‌ సోకిన వారిలో దగ్గు, జ్వరం, ఇతర శ్వాస సంబంధ సమస్యలు బయటపడకముందే నాడీ వ్యవస్థలో కనిపించే ఈ లక్షణాల ద్వారా వైద్యులు, ప్రజలు ముందుగా అప్రమత్తమయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కొవిడ్ 19 మెదడు, వెన్నుముక, నరాలు, కండరాలు ఇలా పూర్తి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని వారు తెలిపారు. మెదడుకు ఆక్సిజన్ అందని పరిస్థితులు తలెత్తుతాయని, గడ్డలు కట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ సోకడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ అతి స్పందన కూడా వాపునకు దారితీసి, మెదడు, నరాల మీద తీవ్ర ప్రభావం చూపనుందన్నారు. అయితే ఇప్పటివరకు వెల్లడైన అధ్యయనాలు కరోనా వల్ల  దీర్ఘకాలికంగా తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి చాలా తక్కువగా ప్రస్తావించాయి. నాడీ వ్యవస్థలో తలెత్తే ఈ సమస్యలు తాత్కాలికమైనవా లేక దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతాయా అనే అంశంపై తమ అధ్యయనాన్ని కొనసాగిస్తామని శాస్త్రవేత్తలు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని