ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరుల హతం

జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్గాం జిల్లా నిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు ప్రారంభించారు......

Published : 13 Jun 2020 07:58 IST

శ్రీగనర్‌: జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్గాం జిల్లా నిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో శనివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వీరి కదలికల్ని గమనించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు ప్రారంభించిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సైన్యానికి చెందిన 19ఆర్‌ఆర్‌ దళాలు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు పుల్వామా జిల్లా త్రాల్‌ పరిధిలోని గులాబ్‌ బాగ్‌ ప్రాంతంలోనూ బలగాలు మరో ఆపరేషన్‌ చేపట్టాయి. ప్రస్తుతం అక్కడ ముష్కరులకు, దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నట్లు కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఇంకా పలు ప్రాంతాల్లోనూ నిర్బంధ తనిఖీలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఉగ్రమూకలకు భారత సైన్యం ముచ్చెమటలు పట్టిస్తున్న విషయం తెలిసిందే. ఏమాత్రం కదలికలు ఉన్నట్లు తెలిసినా భారీ స్థాయిలో బలగాలతో విరుచుకుపడుతున్నారు. గత 15 రోజుల వ్యవధిలో దాదాపు 25 మందికిపైగా ముష్కరులను అంతమొందించారు. 

మరోవైపు పాక్‌ సైన్యం మరోమారు తమ వక్రబుద్ధిని చాటుకుంది. బాలాకోట్‌, మంజాకోట్‌ సెక్టార్లలో నిన్న సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడించింది. నియంత్రణా రేఖ వెంట భారీ స్థాయిలో మోర్టార్లతో విరుచుకుపడింది. వీటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టడంతో దాయాది బలగాలు తోకముడిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు