Updated : 13 Jun 2020 14:36 IST

సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి

సైన్యాధిపతి జనరల్‌ ముకుంద్‌ నర్‌వణే

దిల్లీ: భారత-చైనా సరిహద్దుల్లో పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నర్‌వణే తెలిపారు. చైనాతో స్థానిక స్థాయి కమాండర్లు జరుపుతున్న చర్చల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. దీని ఫలితంగా గత కొన్ని రోజుల్లో రెండు వైపుల భారీ స్థాయిలో బలగాల ఉపసంహరణ జరిగిందని వెల్లడించారు. చర్చల ద్వారానే ప్రస్తుతం నెలకొన్న సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో శనివారం జరిగిన సైనికాధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 

నేపాల్‌తో పటిష్ఠ బంధం..

ఈ సందర్భంగా నేపాల్‌తో ఉన్న సంబంధాల్ని నర్‌వణే గుర్తుచేశారు. ఆ దేశంతో ఎన్నో ఏళ్లుగా భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరు దేశ ప్రజల మధ్య కూడా బలమైన బంధం ఉందని గుర్తుచేశారు. ఉభయ దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న పటిష్ఠమైన బంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ నేపాల్‌ ఇటీవల కొత్త మ్యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు నేడు అక్కడి పార్లమెంటు ముందుకు రానుంది. విపక్షాల మద్దతు కూడగట్టడంలో ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ విఫలం కావడంతో ఇప్పటికే ఈ ప్రక్రియ ఓసారి వాయిదా పడింది. ఈ తరుణంలో నరవణే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కశ్మీర్‌లో స్థానికులే సహకరిస్తున్నారు..

అలాగే జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపైనా నర్‌వణే మీడియాతో మాట్లాడారు. గత 10 రోజుల్లో మన బలగాలు అనేక విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దాదాపు 15 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేశారని తెలిపారు. బలగాల మధ్య సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అలాగే నిఘా వర్గాలకు అందుతున్న ఉగ్రమూకల సమాచారం ఎక్కువగా స్థానిక ప్రజల నుంచే అందుతోందని తెలిపారు. దీన్నిబట్టి అక్కడి పౌరులు ఉగ్రవాదంతో ఏ స్థాయిలో విసిగిపోయారో అర్థమవుతోందన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని వారంతా బలంగా కోరుకుంటున్నారని తెలిపారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని