మహమ్మారిని జయిస్తున్న ధారవి..!

ప్రపంచవ్యాప్తంగా విశ్వరూపం చూపిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి ధనిక దేశాలు కూడా అల్లాడిపోతున్నాయి. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో వేల మందిని పొట్టనపెట్టుకుంటోంది. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో ఆయా దేశాలు పూర్తిగా చేతులెత్తేశాయనే చెప్పాలి. ఈ సందర్భంలో ముంబయిలోని అతిపెద్ద మురికివాడ ధారవి, కరోనా కట్టడిలో అభివృద్ధి చెందిన దేశాలకూ ఒక మోడల్‌గా నిలుస్తోంది.

Updated : 14 Jun 2020 20:40 IST

ఇప్పటికే 7లక్షల మందికి వైద్యపరీక్షలు

ముంబయి: ప్రపంచవ్యాప్తంగా విశ్వరూపం చూపిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి ధనిక దేశాలు కూడా అల్లాడిపోతున్నాయి. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో వేల మందిని పొట్టనపెట్టుకుంటోంది. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో ఆయా దేశాలు పూర్తిగా చేతులెత్తేశాయనే చెప్పాలి. ఈ సందర్భంలో ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ, ముంబయిలోని ధారవి, కరోనా కట్టడిలో అభివృద్ధి చెందిన దేశాలకూ ఒక మోడల్‌గా నిలుస్తోంది.

విశ్వవ్యాప్తంగా ఉగ్రరూపం దాలుస్తోన్న కరోనా మహామ్మారి ఉద్ధృతికి భారత్‌ కూడా వణికిపోతోంది. ఇక దేశంలో నమోదవుతోన్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే కొనసాగుతున్నాయి. ముంబయి నగరంలో అత్యధిక జనసాంద్రత కలిగిన అతిపెద్ద మురికివాడ ధారవిలో కరోనా విజృంభణ కలవరానికి గురిచేసింది. ఒకానొక స్థాయిలో నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కేంద్రబిందువుగా మారింది.  తాజాగా ఈ ప్రాంతం కరోనాను జయించడంలో ముందడుగు వేయడం ఆశ్చర్యపరుస్తోంది.

ప్రతి ఇంటి తలుపుతట్టి..
అతిపెద్ద మురికివాడ ధారవిలో కరోనా వైరస్‌ విజృంభిస్తే ఏర్పడే పరిస్థితులను ముందే ఊహించిన బృహణ్‌ ముంబయి కార్పొరేషన్‌ అధికారులు లక్షల సంఖ్యలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 47వేల ఇళ్ల తలుపులు తట్టారు. ఇంటిలోని ప్రతిఒక్కరి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయిలను పరీక్షించారు. ఇలా ఆ ప్రాంతంలోని 7లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరస్‌ లక్షణాలతో పాటు, అనుమానంగా ఉన్నవారిని సమీప ప్రాంతంలోని పాఠశాలలు, క్రీడా మైదానాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందాలతో వైద్యాన్ని అందించారు. దీంతో ఏప్రిల్‌, మే నెలలతో పోలిస్తే తాజాగా నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అంతేకాకుండా వైరస్‌ సోకినవారిలో కూడా ఎక్కువ మంది కోలుకుంటున్నారు.

ఆందోళన కలిగించిన కేసులు..
అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతంలో ప్రజలు భౌతిక దూరం పాటించడం అసాధ్యమని భావించామని బీఎంసీకి చెందిన అసిస్టెంట్ కమిషనర్‌ కిరణ్‌ దిగావ్‌ఖర్‌ తెలిపారు. అందుకే వైరస్‌ వ్యాప్తిని ముందే అంచనా వేశామని తెలిపారు. దీనిలో భాగంగా వైరస్‌వ్యాప్తి తర్వాత ఎదుర్కోవడం కంటే ముందుగానే దీనిపై పోరు కొనసాగించేందుకు రంగంలోకి దిగినట్లు దిగావ్‌ఖర్‌ వెల్లడించారు. తొలుత కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించినప్పటికీ మరణాల తగ్గింపే లక్ష్యంగా కొవిడ్‌ పరీక్షలు మరింత నిర్వహిస్తూ ముందుకెళ్లామని తెలిపారు.

లక్షణాలు ఉన్నవారిని ఐసోలేట్‌ చేస్తూ..
‘అప్పటికే ముంబయి వ్యాప్తంగా వైరస్‌ తీవ్రత ఎక్కువైంది. నగరవ్యాప్తంగా లక్షణాలు బయటపడుతున్నవారు ఆసుపత్రులకు క్యూ కట్టారు. అప్పటికే వారిలో వైరస్‌ తీవ్రత ప్రభావం ఎక్కువకావడం చూస్తున్నాం. అయినప్పటికీ ధారవిలో ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాం. దీంతో ధారవిలో ముందే వైద్య పరీక్షలు, కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్‌ సోకినవారిని స్వల్పకాలంలోనే గుర్తించగలుగుతున్నాం’ అని ధారవిలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన బీఎంసీ అధికారులు వెల్లడించారు. దీంతో వైరస్‌ వ్యాప్తిని ప్రస్తుతం తగ్గించగలుగుతున్నామని తెలిపారు. మే నెలలో ప్రతిరోజు కొత్తగా 60కి పైగా కేసులు బయటపడగా తాజాగా ఆ సంఖ్య 20కి పడిపోయింది. ముందుగానే కేసులను గుర్తించడం వల్ల మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గించగలుగుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం వైరస్‌ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్యకూడా 51శాతానికి చేరడం ఉపశమనం కలిగిస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

పటిష్ఠ లాక్‌డౌన్‌, ఉచిత వైద్యపరీక్షలు..
కరోనా వైరస్‌ ముంబయిలో విలయతాండవం చేస్తున్న వేళ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కొనసాగించింది. ముఖ్యంగా ధారవిలో ఈ లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలుచేయడం, వైద్య పరీక్షలు అందరికీ అందుబాటులోకి తేవడం వల్లే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇలా వైరస్‌ లక్షణాలు బయటపడిన వారిని ప్రత్యేకంగా ఉంచి వైద్యుల పర్యవేక్షణలో వీరికి వైద్యం అందించినట్లు తెలిపారు.

రంజాన్‌ సమయంలోనూ..
వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న సమయంలోనే ముస్లింల పవిత్ర రంజాన్‌ మాసం మొదలుకావడం కీలకంగా మారింది. అయినప్పటికీ, ఐసోలేషన్‌లో ఉన్న ముస్లింలకు అక్కడే ప్రార్థనలు చేసుకునేలా ఏర్పాటు చేయడంతోపాటు ఉపవాస దీక్ష అనంతరం వారికి కావాల్సిన ఆహారాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో వారిలో ఎలాంటి భయం లేకుండానే అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించారు.

ఉచిత సదుపాయాలు.. 
కరోనా లక్షణాలు, వైరస్‌ సోకినవారికి ఐసోలేషన్‌లో ఉచితంగానే వైద్యం, ఆహారాన్ని అందించారు. ఇలాచేస్తున్న సమయంలోనే అక్కడి ప్రజలు కూడా స్వల్ప లక్షణాలున్న వెంటనే స్వతహాగా క్వారంటైన్‌ కావడం కనిపించిందని ముంబయి మున్సిపల్‌‌  అధికారులు పేర్కొన్నారు.

ఇలా దాదాపు పదిలక్షల జనాభా కలిగిన ఈ ప్రాంతంలో వైరస్‌ కొంతవరకు కట్టడి చేయగలిగినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రస్తుతం నగరవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఇది సాధ్యమైందని.. లాక్‌డౌన్‌ అనంతరం రెండోసారి వైరస్‌ విజృంభించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే వైరస్‌పై ప్రజల్లో అవగాహన వచ్చిందని, రానున్న రోజుల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ కూడా వైరస్‌ తీవ్రత తగ్గింపునకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమయంలో వైరస్‌పై నిరంతరం యుద్ధం కొనసాగుతుందని ముంబయి అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షా 3వేలకు చేరగా కేవలం ఒక్క ముంబయి నగరంలోనే 56వేలుగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని