మరో పదిహేను నగరాల్లో వైరస్ ఉద్ధృతి!

కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం 11వేలకు పైగా కేసులు నమోదవడంతోపాటు ఇప్పటికే కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన అనంతరం పలు నగరాల్లో వైరస్‌ తీవ్రత మరింత పెరిగింది.

Published : 14 Jun 2020 17:18 IST

లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం పెరుగుతోన్న తీవ్రత

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం 11వేలకు పైగా కేసులు నమోదవడంతోపాటు ఇప్పటికే కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన అనంతరం పలు నగరాల్లో వైరస్‌ తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా 15నగరాల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు భారీగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, వడోదర, షోలాపూర్‌, గువాహటితో పాటు మొత్తం 15 ప్రధాన నగరాల్లో వైరస్‌ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. అంతేకాకుండా, దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 63శాతం కేసులు ఈ నగరాల్లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ కేవలం గత 10రోజుల్లోనే పెరగడం గమనార్హం. 

ఇప్పటికే మహారాష్ట్రలో నమోదవుతున్న కేసులలో దాదాపు 54శాతం ఒక్క ముంబయి నగరంలోనే నమోదవుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 70శాతం ఒక్క చెన్నై నగరంలోనే బయటపడుతున్నాయి. ఇక కరోనా మరణాలు రేటు అధికంగా ఉన్న గుజరాత్‌లోనూ ఇదే పరిస్థితి. ఈ రాష్ట్రంలో నమోదౌతున్న మొత్తం కేసుల్లో దాదాపు 71శాతం ఒక్క అహ్మదాబాద్‌ నగరంలోనే ఉంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌, ఆగ్రా, లఖ్‌నవూ, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, నాగౌర్‌, ఛత్తీస్‌గఢ్లోని రాయ్‌గడ, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, ఇండోర్‌, ఉజ్జయిన్‌, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లలో గడచిన పదిరోజుల్లోనే కరోనా వైరస్‌ తీవ్రత విపరీతంగా పెరిగింది. ఈ నగరాల్లో నిత్యం కొత్తగా 50మందికిపైగా  ఈ వైరస్‌ బారినడతున్నారు.

దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా వైద్య పరీక్షలు నిర్వహించే పనిలోపడ్డాయి. గురుగ్రామ్‌ కొత్తగా 31 కంటైన్‌మెంట్‌ జోన్లను హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. ఇక కరోనా తీవ్రత అధికంగా ఉన్న భోపాల్‌లోనూ కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు పెంచాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇండోర్‌లో భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. నాగ్‌పూర్‌లోనూ కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. గడచిన రెండు రోజుల్లో 100పాజిటివ్‌ కేసులు బయటపడడంతో చాలా ప్రాంతాలను హాట్‌స్సాట్‌ జోన్లుగా గుర్తించింది.

ఇదిలాఉంటే, దేశరాజధాని దిల్లీలోనూ కరోనా వైరస్‌ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యధిక మరణాలతో మహారాష్ట్ర(3830)తొలి స్థానంలో ఉండగా గుజరాత్‌(1448), దిల్లీ(1271) రాష్ట్రాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని