లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన లేదు: కేజ్రీవాల్‌

దేశ రాజధాని నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దిల్లీలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని సీఎం కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. రాజధాని నగరంలో......

Updated : 15 Jun 2020 15:36 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దిల్లీలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని సీఎం కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. రాజధాని నగరంలో కేసులు రోజురోజుకీ పెరుగుతున్న దృష్ట్యా అక్కడ లాక్‌డౌన్‌పై వస్తోన్న ప్రచారంపై ఆయన ట్విటర్‌లో స్పందించారు. కరోనా పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం జరిగిన కొద్దిసేపటికే ఆయన ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. దిల్లీలో ఇప్పటివరకు 41,182 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1327మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో దిల్లీ మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 

అయితే, అంతకముందు దిల్లీలో కరోనా వైరస్ పరిస్థితిపై నార్త్‌ బ్లాక్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆప్‌, భాజపా, కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేతలు పాల్గొన్నారు. దిల్లీలో కరోనా వ్యాప్తి, నియంత్రణకు చేపట్టాల్సిన  చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో దాదాపు అందరూ కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం.

జూన్‌ 20 నుంచి రోజూ 18వేల పరీక్షలు: ఆప్‌

దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ త్వరలోనే కొత్త పరీక్షలు నిర్వహిస్తామని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ అన్నారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేవలం 15 నిమిషాల్లోనే నిర్వహించే ఈ కొత్త పరీక్షలు రూ.450లకే అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. జూన్‌ 20 నుంచి దేశ రాజధాని నగరంలో రోజూ 18వేల టెస్ట్‌లు చేస్తామని ఆయన తెలిపారు. 

పరీక్షల ఛార్జీలు 50శాతం తగ్గించాలి: భాజపా

దిల్లీలో కరోనా పరీక్షల ఛార్జీలను 50శాతం తగ్గించాలని భాజపా దిల్లీ చీఫ్‌ అదేశ్‌ గుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షల ఛార్జీలను ప్రభుత్వమే నిర్ణయించాలని సూచించామన్నారు. హోంమంత్రి దీనిపై ఓ కమిటీ నియమించారనీ.. అది రెండు రోజుల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. నివేదిక ఆధారంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఛార్జీలపై నిర్ణయం ఉంటుందని తెలిపారు.

అందరికీ పరీక్షలు చేయాలి: కాంగ్రెస్‌

దిల్లీలో అందరికీ కరోనా పరీక్షలు చేయించాలని, కరోనా బారిన పడిన వారి కుటుంబాలు/ కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న కుటుంబాలకు రూ.10వేలు చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అలాగే, నాలుగో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థులను నాన్‌ పర్మినెంట్‌ రెసిడెంట్‌ వైద్యులుగా పరిగణించి వారి సేవలను ఉపయోగించుకోవాలని ఆ పార్టీ దిల్లీ అధ్యక్షుడు అనిల్‌ చౌధురి సూచించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని