పాట్రిక్‌..నీది స్వచ్ఛమైన హృదయం..

అమెరికాలోని మినియాపొలిస్‌లో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్‌ ఫ్లాయిడ్ మృతికి నిరసిస్తూ, జాతి వివక్షకు వ్యతిరేకంగా కొందరు నల్ల జాతీయులు అక్కడ నిరసనలు...

Published : 15 Jun 2020 23:28 IST

లండన్‌: అది లండన్‌ నగరంలోని వాటర్‌లూ బ్రిడ్జ్‌ ప్రాంతం.. అమెరికాలోని మినియాపొలిస్‌లో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్‌ ఫ్లాయిడ్ మృతికి నిరసిస్తూ, జాతి వివక్షకు వ్యతిరేకంగా కొందరు నల్ల జాతీయులు అక్కడ నిరసనలు చేపడుతున్నారు. ఇంతలో వారికి వ్యతిరేకంగా సంప్రదాయ వాదులు కొందరు ఆందోళన చేపట్టారు. పోటాపోటీగా రెండు గ్రూపులు నినాదాలు చేస్తున్నాయి... అంతలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట మొదలైంది. 

ఈ గందరగోళంలో ఒక వ్యక్తి కిందపడి గాయపడ్డాడు. అయితే గాయపడిన వ్యక్తిని భుజాన వేసుకొని పాట్రిక్ హచిన్సన్‌ అనే వ్యక్తి వైద్యం సహాయం కోసం వేగంగా నడుచుకుంటూ వెళుతున్నాడు. ‘‘మేం చేసేది ఇది కాదు’’అని అరుస్తూ పాట్రిక్‌ గుంపులోంచి ముందుకు సాగుతున్నాడు. అయితే గాయపడిన వ్యక్తిని భుజాలపై మోసుకెళ్తున్న పాట్రిక్‌ను అక్కడున్న వారంతా ఒకింత ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎందుకంటే.. గాయపడిన వ్యక్తి ఒక శ్వేత జాతీయుడు..అతణ్ని మోసుకెళ్తున్న పాట్రిక్‌ నల్ల జాతీయుడు.

శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఫొటోను రాయిటర్స్‌ ఫొటోగ్రాఫర్ డైలాన్‌ మార్టినెజ్‌ తన కెమెరాలో బంధించారు. తర్వాత అన్ని వార్తా, సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో విపరీతంగా వైరల్‌ అయింది. ఫొటో తీసినందుకు డైలాన్‌ను, పాట్రిక్‌ మానత్వాన్ని అభినందిస్తూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. దీని గురించి పాట్రిక్‌ సహచరుడు మాట్లాడుతూ ‘‘వారు (సంప్రదాయ వాదులు) చేయాల్సింది అతను చేశాడు. అతణ్ని చంపకుండా కాపాడాడు’’ అని వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని