కరోనా మరణాన్ని తప్పిస్తున్న ఔషధం అదే!

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 80లక్షల మందిపైగా కరోనా బారిన పడగా, 4లక్షలకు పైగా

Published : 16 Jun 2020 19:03 IST

లండన్‌: ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 80లక్షల మందిపైగా కరోనా బారిన పడగా, 4లక్షలకు పైగా మృత్యువాతపడ్డారు. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు వైద్యులు, పరిశోధకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ను కనుగోనేందుకు వివిధ దేశాలు పరిశోధనలు మొదలు పెట్టాయి. కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్న వారి ప్రాణాలను కాపాడుతోంది ఓ ఔషధం. అదే డెక్సమెథసోన్‌. 

అతి తక్కువ స్థాయిలో డెక్సమెథసోన్‌ స్టెరాయిడ్‌ను వాడటం వల్ల మృత్యువుకు దగ్గరైన కరోనా బాధితులు తిరిగి కోలుకున్నట్లు గుర్తించామని యూకేకు చెందిన పరిశోధకులు తెలిపారు. కరోనా తీవ్రరూపం దాల్చి వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్న బాధితులకు డెక్సమెథసోన్‌ ఇవ్వగా బాగా పనిచేసిందని, వారు తిరిగి కోలుకున్నట్లు ట్రయల్స్‌ గుర్తించామన్నారు. అలా యూకేలో ఇప్పటివరకూ 5వేలమందిని కాపాడారు. పైగా అది అతి తక్కువ ధరకు లభిస్తుండటం విశేషం. 

‘‘కొవిడ్‌-19తో బాధపడుతూ వెంటిలేటర్‌పై ఉన్నవారికి డెక్సమెథసోన్‌ ఆక్సిజన్‌లా పనిచేస్తోంది. అది వారి జీవితాలను కాపాడుతోంది. అది అతి తక్కువ ధరకు లభించడం విశేషం’’ అని ఆక్సఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ మార్టిన్‌ లాండ్రే తెలిపారు. ‘ఈ జనరిక్‌ స్టెరాయిడ్‌ డ్రగ్‌ వ్యాధి తీవ్రతను తగ్గిస్తున్నట్లు ట్రయల్స్‌లో గుర్తించాం. ఇది చక్కగా పనిచేస్తోంది’ అని మరో పరిశోధకుడు పీటర్‌ హార్బీ తెలిపారు. 

ఎలాంటి వారికి దీన్ని వినియోగిస్తున్నారు

కరోనా బారిన పడ్డ ప్రతి 20మందిలో 19మంది ఆస్పత్రికి వెళ్లకుండానే కోలుకుంటున్నారు. ఆ ఒక్క వ్యక్తికి తప్పనిసరిగా వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి వస్తోంది. వీరిని హైరిస్క్‌ పెషెంట్‌గా పరిగణించాలి. ఇలాంటి వారికి మాత్రమే డెక్సమెథసోన్‌ ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని వినియోగించిన తర్వాత కరోనా రోగిలో వ్యాధినిరోధకశక్తి మెరుగవడాన్ని గుర్తించారు. 

ఆక్స్‌ఫర్డ్‌కు  చెందిన వైద్యుల బృందం దీనిపై పరిశోధనలు చేసింది. 2వేలమంది రోగులకు డెక్సమెథసోన్‌ ఇవ్వగా, 4వేల మందికి ఈ ఔషధాన్ని ఇవ్వకుండా పరీక్షలు చేసింది. డెక్సమెథసోన్‌ తీసుకున్న వారి ఆరోగ్యం మెరుగుపడటాన్ని వారు గుర్తించారు. ముఖ్యంగా వెంటిలేటర్‌ చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడుతున్న వారిలో 40శాతం నుంచి 28శాతానికి తగ్గగా, ఆక్సిజన్‌ అవసరమైన వారు 25శాతం నుంచి 20శాతానికి తగ్గారు. 

అతి తక్కువ, మధ్యస్థాయి కరోనా లక్షణాలు ఉన్నవారికి డెక్సమెథసోన్‌ అంతగా ఉపయోగపడదని ప్రొఫెసర్‌ లాండ్రే తెలిపారు. కొవిడ్‌-19కు చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌ ఔషధాల వినియోగానికి అత్యవసరంగా ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ప్రకటించిన నేపథ్యంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని