రెచ్చగొట్టే చర్యలకు బదులిచ్చే సత్తా మనకుంది

లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌ సైనికులకు ప్రధాని మోదీ రెండు నిమిషాల సేపు మౌనం పాటించి...

Updated : 17 Jun 2020 16:48 IST

అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళి

దిల్లీ: భారత్ శాంతిని కోరుకుంటోందని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగిన రీతిలో బదులిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌ సైనికులకు ప్రధాని మోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వృథా కావని, దేశం వాటిని తప్పక గుర్తుపెట్టుకుంటుందన్నారు. ఈ మేరకు కరోనాపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి అమిత్‌ షా, 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

‘‘దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు వృథా కావని జాతికి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీలేదు. భారత్ శాంతిని కోరుకుంటుంది. అలానే కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన రీతిలో స్పందించే సత్తా భారత్‌కు ఉంది. మేము ఎవరినీ రెచ్చగొట్టలేదు. సమయం వచ్చిన ప్రతిసారీ దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని రక్షించడంలో మా సత్తా, సామర్థ్యాలను నిరూపించుకున్నాం. త్యాగాలు, వెనకడుగు వేయకపోవడం, ధైర్యసాహసాలు మన జాతి లక్షణాలు’’ అని ప్రధాని మోదీ అన్నారు.

సోమవారం లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత్ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. భారత్‌-చైనా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. జూన్‌ 19 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.

ఇదీ చదవండి..

అందుకే భారత్ వివరాలు వెల్లడిస్తుంది..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని