గృహహింస.. ట్విటర్‌ కొత్త టూల్

లాక్‌డౌన్‌ సమయంలో భారత్‌లో గృహహింస కేసులు పెరిగాయన్న అధ్యయనాల నేపథ్యంలో.. బాధితులకు సహకరించడానికి బుధవారం ట్విటర్ కొత్త టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Published : 18 Jun 2020 01:33 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ సమయంలో భారత్‌లో గృహహింస కేసులు పెరిగాయన్న అధ్యయనాల నేపథ్యంలో బాధితులకు సహకరించడానికి బుధవారం ట్విటర్ కొత్త టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. గృహ హింసకు సంబంధించి అధికారిక వనరుల నుంచి సమాచారాన్ని, కొత్త అప్‌డేట్‌లను అందించేందుకు ప్రత్యేకంగా సెర్చ్ ‌ప్రాంప్ట్‌ను తీసుకొచ్చింది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సమాచారమిచ్చే ఈ సెర్చ్‌ ప్రాంప్ట్.. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలపై పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది. అలాగే మొబైల్.ట్విటర్.కామ్‌లో కూడా ఈ ఆప్షన్‌ కనిపిస్తుందని తెలిపింది. కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా మహిళలు, బాలికల మీద హింస మరింత పెరిగిందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో మహిళల్లో చైతన్యం కలిగించే ఉద్దేశంతో ట్విటర్ మహిళా శిశు సంక్షేమ శాఖ, జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి పనిచేస్తోంది.

‘ప్రజలు, ఎన్జీఓలు, ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల గృహహింస మీద పోరాటం చేయవచ్చని మేం గుర్తించాం. హింస, దుర్వినియోగానికి వ్యతిరేకంగా సహాయాన్ని కోరే వారికి సెర్చ్‌ ప్రాంప్ట్ ద్వారా మేం అందించే సరైన సమాచారం దోహదం చేస్తుంది. గృహ హింసతో సంబంధం ఉన్న కీవర్డ్స్‌ను వెతికిన ప్రతిసారీ అందుబాటులో సమాచారాన్ని తెలుసుకోవడానికి సెర్చ్‌ ప్రాంప్ట్ సహకరిస్తుంది’ అని ట్విటర్ ఉన్నతాధికారి మహిమా కౌల్ వెల్లడించారు. ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన హ్యాష్‌ట్యాగ్ ‘దేర్‌ఈజ్‌హెల్ప్‌ ప్రాంప్ట్’ ద్వారా క్లిష్ట పరిస్థితుల్లో నమ్మదగిన సమాచారాన్ని అందించి ప్రజలకు సహకరిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఫీచర్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించి, గృహహింసకు సంబంధించి కొత్త కీవర్డ్స్‌ను అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని