Updated : 18 Jun 2020 13:36 IST

గాల్వన్‌ ఘటన: ఆ రాత్రి ఏం జరిగింది?

దిల్లీ: భారత్‌-చైనా బలగాల మధ్య గత కొన్ని దశాబ్దాల తరువాత తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులయ్యారు. అలాగే, దాదాపు 43మంది చైనా సైనికులు కూడా మృతిచెందినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, అక్కడి మరణాలపై చైనా ఇప్పటివరకు పెదవి విప్పకపోవడం గమనార్హం. 

అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది?

* భారత్‌-చైనా సరిహద్దు వెంట గత కొన్ని రోజులుగా స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనపై భారత్‌-చైనాకు చెందిన లెఫ్టెనెంట్‌ జనరల్‌ స్థాయిల్లో ఈ నెల 6వ తేదీన చర్చలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.

* ఈ సమయంలోనే చైనా బలగాలు భారత్‌వైపు వచ్చి శిబిరాలను ఏర్పాటుచేశాయి. భారత బలగాలు వాటిని కూల్చివేశాయి. దీంతో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

* ఆ సమయంలో అక్కడ నుంచి వెళ్లిపోయిన చైనా బలగాలు వారం చివరలో తిరిగి భారీ సంఖ్యలో చేరుకున్నాయి. దీంతో జూన్‌ 14న రాళ్లదాడి జరిగింది.

* సోమవారం సాయంత్రం ఇరుబలగాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆ సమయంలో వీరు గాల్వన్‌ నదివైపు దూసుకొచ్చారు. ఈ పెనుగులాటలో భారత్‌ సైనికులు చాలా మంది గాల్వన్‌ నదిలో పడిపోయారు. అయితే జూన్‌ 6న జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో జూన్‌ 16న మరోసారి ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారులు భేటీ కావాల్సి ఉంది. ఆ సమయంలో ఇరుదేశాల బలగాలు తమ దేశ భూభాగంలోకి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాయి. 

* కానీ, చైనా బలగాలు మాత్రం వెనక్కి వెళ్లలేదు. దీంతో నిరాయుధులుగా ఉన్న కర్నల్‌ సంతోష్‌ బాబు నేతృత్వంలోని బృందం వారితో చర్చలు జరిపేందుకు ముందుకెళ్లింది. ఆ సమయంలో చైనా బలగాలు వెనక్కి వెళ్లడానికి నిరాకరించడంతో పాటు భారత సైనికులను రెచ్చగొట్టేవిధంగా ప్రవర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా భారత సైనికులపై రాళ్లు, కర్రలు, ముళ్లకంచెలతో దాడికి దిగింది. దీంతో భారత సైనికులు ప్రతి దాడికి దిగారు.

* ఘర్షణ సమయంలో ఎలాంటి తుపాకులూ వాడలేదని సమాచారం. సైనికాధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం చైనా బలగాల చేతిలో గాయపడిన భారత సైనికులకు ఎక్కువగా రాళ్ల దాడి, రాడ్లతో కొట్టడం వల్లే తీవ్ర గాయాలు అయినట్లు తెలిసింది.

* తొలుత చైనా సైన్యం భారత్‌ సైనికులపై దాడికి పాల్పడగా కర్నల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో భారత్‌ బలగాలు కర్నల్‌తో పాటు మరో హవీల్దార్‌ను వెనక్కి తీసుకొచ్చాయి. అయితే కొందరు చైనా బలగాల్లో బందీగా ఉండిపోయారు. 

* 40 నిమిషాలు గడిచిన తరువాత చైనా బలగాల చేతిలో బందీగా ఉండిపోయిన భారత సైనికులను తీసుకొచ్చేందుకు భారత సైన్యం ఆ ప్రాంతంలోకి వెళ్లింది. 

* ఆ సమయంలో భారత సైనికులు చైనా బలగాలపై ఎదురుదాడి చేశాయి. అటువైపు దాదాపు 55-56మంది చైనా సైనికులు ఉన్నారు. ఈ సారి ఘర్షణ భారీగా జరగడంతో ఆ సమయంలో చాలా మంది చైనా సైనికులు మరణించి ఉంటారని అంచనా. ఈ ఘర్షణ జరుగుతున్న ప్రదేశం చాలా ఇరుకుగా ఉండడంతో ఎక్కువ మంది గాల్వన్‌ నదిలో పడిపోయినట్లు సమాచారం. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ ఘర్షణ అర్ధరాత్రి వరకూ కొనసాగిందని సైనిక ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని