చైనా.. వీటికి బదులేదీ? చెప్పిందే మళ్లీనా?

దేశ సరిహద్దులో గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై చైనా చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతోంది తప్ప అడిగిన ప్రశ్నలకు సమాధానాలు......

Published : 18 Jun 2020 20:12 IST

విలేకర్ల ప్రశ్నలకు సమాధానమివ్వని చైనా విదేశాంగ ప్రతినిధి

బీజింగ్‌: దేశ సరిహద్దులో గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై చైనా చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతోంది తప్ప అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తోంది. ఈ సమావేశంలో విలేకర్లు అడిగిన పలు కీలక ప్రశ్నలకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. తాజాగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలను న్యాయపరమైన పద్ధతిలో పరిష్కరించుకొనేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పారు. వీలైనంత తర్వగా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, శాంతి, ప్రశాంతతను కాపాడుకోవాలని కమాండర్‌ స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిపారు. సరిహద్దు వద్ద పరిస్థితి అంతా స్థిరంగా.. నియంత్రణలోనే ఉంది. రెండు దేశాల అధినేతల మార్గదర్శకత్వంలో ఇరు పక్షాలు పరిస్థితిని సమర్థంగా నిర్వహించగలవని, సరిహద్దు వెంబడి శాంతి, స్థిరత్వాన్ని సంయుక్తంగా కాపాడగలవని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్యకరమైన, స్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తాయని తాము నమ్ముతున్నామన్నారు. భారత్‌ - చైనా సరిహద్దులోని గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న దారుణ ఘటనకు దారితీసిన, చైనా వైపు మరణాలకు సంబంధించిన కీలక ప్రశ్నలకు ఆయన స్పందించకపోవడం గమనార్హం. 

ఈ తీవ్ర ఘర్షణల్లో చైనా వైపు సైనికులు ఎంతమంది చనిపోయారనే ప్రశ్నకు సైతం ఝావో లిజియాన్‌ స్పందించలేదు. అలాగే, సరిహద్దులో గల్వాన్‌ నది వద్ద చైనా ఆనకట్ట నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలపైనా మాట్లాడేందుకు నిరాకరించారు. చైనా ఏర్పాటు చేసిన శిబిరాలను కూల్చేందుకు భారత సైనికులు వెళ్లడంతోనే ఈ బాహాబాహీ చోటుచేసుకుందా? భారత సైనికులపై ఇనుప రాడ్లు, కర్రలు, ముళ్ల కంచెలతో అతి కిరాతకంగా దాడి చేశారా?  అన్న ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధానమిచ్చారు. పైగా ఇదివరకు చేసిన వాదననే మళ్లీ మళ్లీ ఉటంకిస్తూ భారత్‌ సైనికులదే తప్పట్టుగా నిందించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ ఘటనలో తప్పొప్పులు చాలా స్పష్టంగా ఉన్నాయని చెబుతూనే  చైనాకు బాధ్యత లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే చైనా ఈ ఘటనపై అన్ని వివరాలు తెలిపిందన్నారు.

లద్దాఖ్‌ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో తెలుగు తేజం కర్నల్‌ సంతోష్‌బాబుతో పాటు 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే, చైనా మాత్రం తమ దేశానికి చెందిన సైనికులు ఎంతమంది చనిపోయారో చెప్పేందుకు నామోషీగా భావిస్తూ ఆ వివరాలను వెల్లడించడంలేదు. ఇప్పటికే ఆ దేశంలో దాదాపు 35మంది సైనికులు మృతిచెంది ఉంటారంటూ అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని