కరోనా మరణాలు: తొలిస్థానంలో ఊహించని దేశం!

ప్రతి పదిలక్షల జనాభాకు సంభవించిన కొవిడ్‌-19 మరణాలను ప్రాతిపదికగా తీసుకుంటే... ఈ దేశం తొలిస్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

Published : 20 Jun 2020 01:41 IST

భారత్ స్థానం ఎంతంటే...

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి అంతర్జాతీయంగా 213 దేశాల్లో వేళ్ళూనింది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదిన్నర లక్షలకు పైగా కొవిడ్‌-19 బాధితులున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక కరోనా మరణాలు నాలుగున్నర లక్షల పైమాటే! కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశంలో కరోనా కేసులు 3,80,532కు చేరగా...12,573 మరణాలు నమోదయ్యాయి. కొవిడ్‌-19కు సంబంధించి తాజా గణాంకాలను అందించే అంతర్జాతీయ సంస్థ ‘వరల్డో మీటర్‌’ ప్రకారం.. కొవిడ్‌ మరణాలను గురించి మరికొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సంఖ్యా పరంగా 1,20,688 కొవిడ్‌ మరణాలతో అమెరికా తొలిస్థానంలో ఉండటం అందరూ ఊహించిందే. ఇక ఈ వరుసలో భారత్‌  ఎనిమిదో స్థానంలో ఉంది. అమెరికా తర్వాతి స్థానాల్లో- బ్రెజిల్‌ (47869), బ్రిటన్‌ (42288), ఇటలీ (34515), ఫ్రాన్స్‌ (29603), స్పెయిన్‌ (27136) మెక్సికో (19749) ఉన్నాయి.

అయితే ప్రతి పది లక్షల జనాభాకు సంభవించిన కొవిడ్‌-19 మరణాలను ప్రాతిపదికగా తీసుకుంటే... దక్షిణ యూరోప్‌లోని అతిచిన్న దేశం సాన్‌ మారినో తొలిస్థానంలో నిలిచింది. కేవలం 61 చ.కి.మీ వైశాల్యం, 34వేల కన్నా తక్కువ జనాభాగల ఈ దేశం... కరోనా కేంద్రంగా ఉన్న ఇటలీ సమీపంలో ఉండటం శాపంగా పరిణమించింది. సాన్‌ మారినోలో ప్రతి పదిలక్షల మందికి అత్యధికంగా 1,238 మంది చనిపోగా... దాని తర్వాత బెల్జియం (836), అండోరా (673), బ్రిటన్ (623)‌, స్పెయిన్‌ (580), ఇటలీ (571), స్వీడన్ (500)‌, ఫ్రాన్స్ (454)‌, అమెరికా (365), నెదర్లాండ్స్‌ (355) తొలి పది స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాలతో పోలిస్తే ప్రతి పదిలక్షల జనాభాకు కరోనా మరణాల సంఖ్య తొమ్మిదిగా ఉన్న భారత్‌  106వ స్థానంలో ఉంది. అంతేకాకుండా ప్రపంచ సగటు (58.6) కంటే కూడా ఇది తక్కువగానే ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని