డ్రాగన్‌ కార్యకలాపాలపై గట్టి నిఘా!

వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైన్యం దురాక్రమణలను దీటుగా తిప్పికొట్టేందుకు భారత సైన్యానికి ప్రభుత్వ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో........

Updated : 21 Jun 2020 14:35 IST

దిల్లీ: వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైన్యం దురాక్రమణలను దీటుగా తిప్పికొట్టేందుకు భారత సైన్యానికి ప్రభుత్వ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె, నావికాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌, వాయుసేనాధిపతి చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌ భదౌరియా హాజరయ్యారు. చైనా సైన్యం దుస్సాహసాలకు గట్టిగా బదులివ్వడానికి సిద్ధంగా ఉండాలని భారత సైన్యానికి రాజ్‌నాథ్‌ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

ఇకపై సరిహద్దుల వద్ద భారత్‌ భిన్నమైన వ్యూహాత్మక విధానాల్ని అవలంబించనున్నట్లు తెలుస్తోంది. భూ సరిహద్దు, గగనతలం సహా వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో చైనా కార్యకలాపాలపై ఇకపై అత్యంత జాగరూకతతో ఉండాలని భారత సైన్యాన్ని రాజ్‌నాథ్‌ ఆదేశించినట్లు సమాచారం. డ్రాగన్‌ ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడినా వెంటనే తిప్పికొట్టేందుకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీ, వాయుసేనలు సరిహద్దుల వద్ద తమ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటున్నట్లు సమాచారం.

లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్-చైనా మధ్య జూన్‌ 16న తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కర్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది సైనికులు అమరులయ్యారు. ఈ ఘటనతో గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. చైనా నుంచి వచ్చే ఎలాంటి దుశ్చర్యలనైనా తిప్పికొట్టేందుకు భారత సైన్యం సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నేడు రాజ్‌నాథ్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఆయన రష్యాకు బయలుదేరి వెళ్లనున్నారు.  

ఇదీ చదవండి..

సరిహద్దు సెగలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు