దిల్లీ జైలులో కరోనాతో వ్యక్తి మృతి

దిల్లీలోని మండోలి జైలులో ఓ వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. జైలులో కరోనాతో మృతిచెందిన మొదటి కేసు ఇదే కావడం..

Published : 21 Jun 2020 22:10 IST

28 మందిని పరీక్షించనున్న అధికారులు

దిల్లీ: దిల్లీలోని మండోలి జైలులో ఓ వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. జైలులో కరోనాతో మృతిచెందిన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం. హత్య కేసులో మండోలిలోని కేంద్ర కారాగారం-14లో కన్వర్‌ సింగ్‌ (62) 2016 నుంచి జీవితకాల శిక్ష అనుభవిస్తున్నాడు. అతను ఈ నెల‌ 15న అనారోగ్యంతో జైలులోనే మృతిచెందాడు. మృతదేహానికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలినట్లు అధికారులు వెల్లడించారు. జూన్‌ 15న కన్వర్‌ సింగ్ బారక్‌లోని కొందరు సభ్యులు అతణ్ని మెలకువలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వృద్దుడు స్పందించలేదు. వెంటనే జైలు అధికారులు వృద్ధుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. 

దిల్లీ జైళ్ల డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ మాట్లాడుతూ ‘‘కన్వర్ ‌సింగ్‌ మృతి వ్యవహారంలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విచారణ జరిపారు. వైద్య బృందం అతడికి కొవిడ్-19 పరీక్షలు చేశారు. శనివారం వచ్చిన రిపోర్టులో మృతుడికి కరోనా ఉన్నట్లు తేలింది. అతడికి కరోనా ఎలా సోకిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు. మృతుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ బారక్‌లో ఉన్న మిగిలిన 28 మందికి అధికారులు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించనున్నారు. దిల్లీలో తిహాడ్‌, రోహిణి, మండోలి కారాగారాలున్నాయి. వాటిల్లో ఇప్పటివరకు 23 మంది ఖైదీలకు కరోనా సోకింది. 16 మంది కోలుకోగా కన్వర్ ‌సింగ్‌ మృతిచెందాడు. 45 మంది జైలు సిబ్బంది కూడా మహమ్మారి బారిన పడ్డారని, వారిలో ఏడుగురు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని