Updated : 22/06/2020 12:03 IST

దాచి ఉంచడం దౌత్యనీతి కాదు: మన్మోహన్‌

గల్వాన్‌ ఘటన నేపథ్యంలో కేంద్రంపై మాజీ ప్రధాని వ్యాఖ్యలు

దిల్లీ: సంక్షోభ సమయంలో ఏకతాటిపై నిలబడి సవాళ్లను ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. ఇటీవల సరిహద్దుల్లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై సమాచారం బయటపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. దాచి ఉంచడం దౌత్యనీతికి, సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదని హితవు పలికారు. దేశ భద్రతపై ప్రధాని మోదీ గతంలో చెప్పిన మాటల్ని గుర్తుంచుకోవాలన్నారు.

కర్నల్‌ సంతోష్‌బాబు సహా అమర జవాన్ల కుటుంబాలకు కేంద్రం, ప్రధాని న్యాయం చేయాలని మన్మోహన్‌ కోరారు. వారికి ఏం తక్కువ చేసినా ప్రజల నమ్మకానికి చారిత్రక ద్రోహం చేసినట్లే అవుతుందన్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలు భవిష్యత్‌ తరాలు భారత్‌ను చూసే దృక్కోణంపై ప్రభావం చూపుతాయన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రధానిపైనే ఉంటుందని.. బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని హితవు పలికారు. తాను చేసే వ్యాఖ్యల పర్యవసానాల పట్ల ప్రధాని ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. దేశ సమగ్రతను కాపాడేందుకు అమరవీరులు అసమాన త్యాగం చేశారంటూ వారి సేవల్ని కీర్తించారు. చైనాతో సమస్య ముదరకుండా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కలిసి పనిచేయాలని సూచించారు. 

గల్వాన్‌ లోయతో పాటు పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలో భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని మన్మోహన్‌ అన్నారు. ఏప్రిల్‌ నెల నుంచే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేశాన్ని రక్షించుకునే విషయంలో ఎలాంటి బెదిరింపులకు లొంగిపోవద్దని హితవు పలికారు. ప్రధాని తన మాటలతో ప్రత్యర్థులకు స్వేచ్ఛనివ్వొద్దన్నారు. 

భారత భూభాగాలు ఆక్రమణకు గురికాలేదంటూ ప్రధాని మోదీ శుక్రవారం జరిగిన అఖిల పక్ష భేటీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. అదే నిజమైతే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు తలెత్తాయంటూ విపక్షాలు నిలదీశాయి. ప్రధాని మాటలు చైనాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లుగా ఉన్నాయని ఆరోపించాయి. దీంతో రంగంలోకి దిగిన పీఎంఓ.. విపక్షాల విమర్శలు సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడింది. వాస్తవాధీన రేఖను అతిక్రమించే ప్రయత్నాలను మన సైన్యం గట్టిగా తిప్పికొట్టే యత్నంలోనే హింసాత్మక ఘటన చోటుచేసుకుందని వివరించింది. తాజాగా గళం విప్పిన మన్మోహన్‌.. మోదీ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని