పాక్‌ పైలట్ల గురించి షాకింగ్‌ నిజాలు!

గత నెల చోటుచేసుకున్న కరాచీ విమాన ప్రమాదానికి సంబంధించిన విచారణలో షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి.

Updated : 25 Jun 2020 20:19 IST

మూడింట ఒకరివి నకిలీ లైసెన్సులు
ప్రమాద సమయంలో కొవిడ్‌ గురించి చర్చలు

ఇస్లామాబాద్: గత నెల చోటుచేసుకున్న కరాచీ విమాన ప్రమాదానికి సంబంధించిన విచారణలో షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. పాకిస్థాన్‌ పైలట్లలో 30 శాతానికి పైగా విమానాలు నడిపేందుకు అర్హత లేనివారేననీ, వారి లైసెన్సులు నకిలీవనీ పాకిస్థాన్‌ విమానయానశాఖ మంత్రి గులాం సర్వార్‌ ఖాన్‌ ప్రకటించారు. అంతేకాకుండా సుమారు 100 మందిని పొట్టన పెట్టుకున్న కరాచీ విమాన ప్రమాదానికి కూడా వారి పరధ్యానమే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలిపారు.

మే 22న లాహోర్‌ నుంచి కరాచీకి ప్రయాణిస్తున్న ఎయిర్‌బస్‌ ఏ320 విమానం, కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో కూలిపోయింది. నాటి ఘటనలో విమాన పైలట్లు విధి నిర్వహణపై దృష్టి సరిగా కేంద్రీకరించలేదని పాక్‌ విమానయాన మంత్రి తెలిపారు. వారి పరధ్యానం, మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రమాదానికి కారణాలని మంత్రి తెలిపారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ల సూచనలను వారు బేఖాతరు చేశారని.. విమానం నడుపుతున్నంత సేపూ వారు కరోనా వైరస్‌ మహమ్మారి గురించే చర్చించుకున్నారని ఖాన్ అన్నారు.

ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో...  పాక్‌కు చెందిన 260 మందికి పైగా పైలట్లు అర్హత పరీక్షలో డబ్బు చెల్లించి తమకు బదులుగా వేరొకరితో పరీక్షలు రాయించారని సర్వార్‌ ఖాన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో నకిలీ లైసెన్సులు కలిగిన పైలంట్లందరినీ వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్టు పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని