
కరోనాకు వేసవి సెలవులుండవ్..
కాలిఫోర్నియా గవర్నర్ వ్యాఖ్య
యూఎస్‌లో మళ్లీ వణుకు.. ఒకేరోజు 40వేలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గినట్టే కనిపించిన ఈ మహమ్మారి మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్క రోజే 40వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. అమెరికాలో ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన లెక్కల ప్రకారం అమెరికాలో శుక్రవారం 40,870 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 24న ఒకరోజులో నమోదైన 36,400 గరిష్ఠ కేసుల తర్వాత ఆ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు అమెరికాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2.4 మిలియన్లు దాటగా.. 1.25లక్షల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాల్లో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. బ్రెజిల్ రెండోస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ మాత్రం అమెరికాలో 20 మిలియన్ల మందికి ఈ కొవిడ్ -19 సోకి ఉంటుందని వ్యాఖ్యానించడం మరింత ఆందోళన కలిగించే అంశం.
కారణాలివేనా..?
అమెరికాలో కేసుల ఉద్ధృతి మళ్లీ పెరగడానికి కారణాలు లేకపోలేదు. టెక్సాస్, ఫ్లోరిడా, అరిజోనాతో పాటు పలు రాష్ట్రాలు లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో పాటు బార్లు, పబ్బులకు అనుమతిచ్చారు. ఈ చర్యలే అక్కడ కరోనా విజృంభణకు కారణమని తెలుస్తోంది. యువత ఎక్కువగా బయట తిరుగుతున్నారనీ.. కొందరు మాస్క్‌లు ధరించడం లేదని.. కొన్ని చోట్లయితే, భౌతికదూరం నిబంధనలు సైతం పాటించకపోవడం వల్లే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతోందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పలుచోట్ల బార్లు మూసివేత ఆదేశాలు
తాజాగా కేసులు పెరుగుతుండటంతో టెక్సాస్ గరవ్నర్ గ్రెజ్ అబ్బోట్ బార్లను మూసివేయాలని శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఫ్లోరిడా ప్రభుత్వం కూడా కొత్త నిబంధనలను జారీ చేసింది. అక్కడి బార్లపై నిషేధం విధించింది. అలాగే, ఫ్లోరిడాలోని మియామీ దాదె కౌంటీ మేయర్ కూడా అక్కడి బీచ్‌లను జులై 3 నుంచి 7 వరకు మూసివేయనున్నట్టు వెల్లడించారు.
కరోనా.. వేసవి సెలవులు తీసుకోదు!
కరోనా తీవ్రత అధికంగా ఉన్న కాలిఫోర్నియాలో గవర్నర్ గావిన్ న్యూసమ్ కూడా ఇంపీరియల్ కౌంటీలో కొత్త నిబంధనలు ప్రకటించారు. కరోనా మహమ్మారి వేసవి సెలవులకు వచ్చి వెళ్లిపోయేదేమీ కాదని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మరోవైపు ఒహైయో గవర్నర్ డైవైన్ కూడా దీనిపై స్పందించారు. తమ రాష్ట్రంలోనూ కేసులు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయన్నారు. ఇది ఎంతో ప్రమాదకరమైన సమయమని తెలిపారు. టెక్సాస్, ఫ్లోరిడా, మరికొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నవి ప్రతిఒక్కరికీ ఓ హెచ్చరిక అని వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.