ఉపాధిపై క‌రోనా మ‌హ‌మ్మారి పిడుగు!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స్తంభించిపోయాయి. ఈ కార‌ణంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిరుద్యోగిత భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈ సంవ‌త్స‌రం రెండో త్రైమాసికానికి ప్ర‌పంచ కార్మిక మార్కెట్లో భారీ అనిచ్ఛితి ఏర్ప‌డింది. దీంతో, ఈ సంవ‌త్స‌రంలో ఉపాధి క‌ల్ప‌న స్థాయి పూర్వస్థితికి (మ‌హ‌మ్మారికి ‌ముందు) వ‌చ్చే అవ‌కాశా‌లు క‌నిపించ‌డం లేద‌ని అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ‌(ఐఎల్ఓ) తాజా నివేదిక వెల్ల‌డించింది.

Published : 01 Jul 2020 23:02 IST

అభివృద్ధి చెందిన దేశాల్లో తీవ్ర న‌ష్టం

పూర్వస్థాయిని చేరుకోవ‌డం క‌ష్ట‌మే! - ILO నివేదిక

జెనీవా: ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స్తంభించిపోయాయి. ఈ కార‌ణంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిరుద్యోగిత భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈ సంవ‌త్స‌రం రెండో త్రైమాసికానికి ప్ర‌పంచ కార్మిక మార్కెట్లో భారీ అనిశ్చితి ఏర్ప‌డింది. దీంతో, ఈ సంవ‌త్స‌రంలో ఉపాధి క‌ల్ప‌న స్థాయి పూర్వస్థితికి (మ‌హ‌మ్మారికి ‌ముందు) వ‌చ్చే అవ‌కాశా‌లు క‌నిపించ‌డం లేద‌ని అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ‌(ఐఎల్ఓ) తాజా నివేదిక వెల్ల‌డించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌నిగంట‌లు భారీ స్థాయిలో త‌గ్గిపోయాయ‌ని, ఇది ఈ సంవ‌త్స‌రం ప్రారంభంలో అంచ‌నా వేసినదానికంటే దారుణంగా ఉన్న‌ట్లు ఐఎల్ఓ వెల్ల‌డించింది. ఈ ప్ర‌భావంతో ముఖ్యంగా అమెరిక‌న్లే అత్య‌ధికంగా న‌ష్ట‌పోతున్న‌ట్లు తెలిపింది. అక్క‌డ ఇప్ప‌టికే దాదాపు 18.3శాతం ప‌నిగంట‌లు కోల్పోయిన‌ట్లు ఐఎల్ఓ పేర్కొంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంద‌ని ఐఎల్ఓ నివేదిక వెల్ల‌డించింది. అంతేకాకుండా ఈ మ‌హ‌మ్మారి మ‌హిళా కార్మికుల‌పైనా అత్యంత ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిన‌ట్లు పేర్కొంది. రియ‌ల్ ఎస్టేట్‌ రంగంతోపాటు రిటైల్‌, హోట‌ల్ ఇండ‌స్ట్రీ కుదేలు కావ‌డంతో మ‌హిళా కార్మికుల ఉపాధిపై పిడుగుప‌డింద‌ని ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది.

క‌రోనా కార‌ణంగా ఏర్ప‌డ్డ ప‌రిస్థితుల‌తో ఈ సంవ‌త్స‌రం రెండో త్రైమాసికానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 14శాతం ప‌నిగంట‌లు కోల్పోయార‌ని, ఇది 40కోట్ల పూర్తిస్థాయి ఉద్యోగాల‌కు స‌మాన‌మ‌ని అంచ‌నా వేసింది. మ‌రికొంత కాలం‌ ఈ ప్ర‌తికూల ఫ‌లితాలే కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ట్లు అభిప్రాయ‌ప‌డింది. నాలుగో త్రైమాసికంనాటికి ఈ ప‌నిగంట‌ల‌ న‌ష్టం 4.9శాతంగా ఉండ‌నుంద‌ని లెక్క‌క‌ట్టింది. ఇది దాదాపు 14కోట్ల పూర్తిస్థాయి ఉద్యోగాల‌తో స‌మాన‌మ‌ని తెలిపింది. ఒక‌వేళ రెండోద‌ఫా మ‌హ‌మ్మారి విజృంభిస్తే మాత్రం ఈ ప‌నిగంట‌ల‌ న‌ష్టం 11.9శాతానికి పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ఐఎల్ఓ అంచ‌నా వేసింది.

త‌క్కువ గంట‌లు ప‌నిచేసే, ఉద్యోగాలు కోల్పోయినవారిని, కార్మిక శ‌క్తినుంచి వైదొలిగిన వారిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ గ‌ణాంకాలు రూపొందించిన‌ట్లు ఐఎల్ఓ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గై రైడ‌ర్ జ‌నీవాలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దిగ‌జారుతున్న ప‌రిస్థితుల‌కు ఇవి అద్దం ప‌డుతున్నాయ‌ని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని