అంతా చైనానే చేస్తోంది..!

ఆగ్నేయాసియాలో చైనాకు అత్యంత సన్నిహిత దేశం మయన్మార్.

Published : 02 Jul 2020 16:43 IST

మయన్మార్‌ ఆరోపణలు

నేపితా: ఆగ్నేయాసియాలో చైనాకు అత్యంత సన్నిహిత దేశం మయన్మార్. ఎప్పుడూ నోరు తెరిచి డ్రాగన్‌ను పల్లెత్తు మాట ఆనదు. కానీ, ఇప్పుడు అదే చైనా నుంచి రక్షించుకోడానికి అంతర్జాతీయ సహకారాన్ని కోరుతోంది. ఇటీవల రష్యా టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మయన్మార్ సీనియర్ జనరల్ మిన్‌ ఆంగ్ లాయింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థలకు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందని పరోక్షంగా వేలెత్తి చూపారు. తిరుగుబాటు గ్రూపులను అణచివేసేందుకు అంతర్జాతీయ సహకారం కావాలని కోరారు. మయన్మార్‌లో చురుగ్గా ఉన్న ఉగ్రవాద సంస్థలకు ‘బలమైన శక్తుల’ మద్దతు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మయన్మార్‌ ఉత్తరం వైపు చైనాతో సరిహద్దులు ఉన్నాయి.

సీనియర్‌ జనరల్ ఆందోళనపై ఆ దేశ  మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్ జా మిన్‌ తున్‌ స్పష్టత ఇచ్చారు. ఆరాకన్‌ ఆర్మీ(ఏఏ), ఆరాకన్‌ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్‌ఎస్‌ఏ)ని ఉద్దేశించే ఆర్మీ ఛీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. చైనా సరిహద్దులో ఉన్న రాఖైన్ రాష్ట్రంలో ఆ సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటి వద్ద చైనాలో తయారైన ఆయుధాలను గుర్తించామని, 2019లో సైన్యంపై ఉగ్రసంస్థలు ఈ ఆయుధాలతోనే దాడులకు పాల్పడ్డాయని వెల్లడించారు.  2019లో నిషేధిత తాంగ్‌ నేషనల్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఆ దేశ సైన్యం పెద్దఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. వాటిలో 70 వేల నుంచి 90 వేల డాలర్ల విలువైన క్షిపణులు కూడా ఉండటం గమనార్హం. ఆ సమయంలో లభ్యమైన ఆయుధాల్లో ఎక్కువ భాగం చైనాకు చెందినవేనని మిలిటరీ ప్రతినిధి మేజర్‌ జనరల్‌ తున్‌ తున్‌ న్యీ ప్రకటించారు కూడా. 

మయన్మార్‌ను చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు...

చైనా సరిహద్దులో ఉన్న మయన్మార్ తిరుగుబాటు సంస్థలు ఎక్కువగా చైనా ఆయుధాలనే ఉపయోగిస్తుంటాయి. మయన్మార్‌ను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు చైనా పాత్రపై ఈ ఘటనలు అనుమానాలకు తావిస్తున్నాయి. బీఆర్‌ఐ ప్రాజెక్టును అమలు చేసేందుకు ఈ ఉగ్రసంస్థలను చైనా పావులా వాడుకుంటుందని, ఆ చిన్న పొరుగు దేశంలో అనిశ్చితికి కారణమవుతుందన్న వాదనలున్నాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం తూర్పు భాగంలో వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా చైనా-మయన్మార్ ఎకనామిక్‌ కారిడార్‌ను అమలు చేయాలని బీజింగ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు అమలు కోసం చైనా ఇచ్చే రుణాలు ఊబిలో చిక్కుకునేలా చేస్తాయని మయన్మార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని