అమెరికా: ఒక్క‌రోజే 55వేల కేసులు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి అగ్ర‌రాజ్యం అమెరికాను వెంటాడుతూనే ఉంది. తాజాగా నిన్న ఒక్క‌రోజే దేశంలో రికార్డు స్థాయిలో 55,000 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్ర‌పంచంలో ఏదేశంలోనూ ఇప్ప‌టివ‌ర‌కు 24గంటల్లో ఇన్ని కేసులు న‌మోదుకాలేదు.

Published : 03 Jul 2020 23:59 IST

రికార్డు స్థాయి కేసుల‌తో అగ్ర‌రాజ్యం ఉక్కిరిబిక్కిరి

వాషింగ్ట‌న్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి అగ్ర‌రాజ్యం అమెరికాను వెంటాడుతూనే ఉంది. తాజాగా నిన్న ఒక్క‌రోజే దేశంలో రికార్డు స్థాయిలో 55,000 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్ర‌పంచంలో ఏదేశంలోనూ ఇప్ప‌టివ‌ర‌కు 24గంటల్లో ఇన్ని కేసులు న‌మోదు కాలేదు. అంత‌కుముందు జూన్ 19న‌ బ్రెజిల్‌లో ఒకేరోజు న‌మోదైన‌ 54,771 కేసుల రికార్డును అమెరికా వెన‌క్కు నెట్టింది. నిన్న ఒక్క‌రోజే అమెరికా ‌వ్యాప్తంగా 55,274 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు కొన్ని రాష్ట్రాల‌కే ప‌రిమిత‌మైన మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 37రాష్ట్రాల్లో ఉగ్ర‌రూపం దాల్చింది. ఇప్పటి వరకూ న్యూయార్క్‌ను వ‌ణికించిన ఈ మ‌హ‌మ్మారి తాజాగా ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో విజృంభిస్తోంది. గ‌త రెండువారాలుగా ఇక్క‌డ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇక టెక్సాస్‌లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

ఇంకా తొలి వేవ్‌లోనే..

వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టిందని భావించిన ఆయా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్లు లాక్‌డౌన్ స‌డ‌లింపు ప్ర‌క్రియ‌ను చేప‌ట్టారు. ఈ స‌మ‌యంలోనే కేసుల సంఖ్య భారీగా పెర‌గ‌డంతో తిరిగి సాధార‌ణ స్థితికి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల‌న్నీ తాత్కాలికంగా నిలిపివేశారు. స‌డ‌లించిన నిబంధ‌న‌ల‌ను కూడా వెన‌క్కి తీసుకుంటున్నారు. 'ఈ సంక్షోభం నుంచి మ‌నం బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఇంకా మ‌నం ఈ సంక్షోభం తొలి వేవ్‌లోని ఉన్నాం. ప్ర‌తి ఒక్క‌రు వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌గా వ్యవ‌హ‌రించాల్సిన స‌మ‌యం' అని కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్ విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే, అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 28ల‌క్ష‌ల కొవిడ్‌19 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా ల‌క్షా 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చ‌ద‌వండి..

సంక్ర‌మ‌ణ సామ‌ర్థ్యం పెరుగుతోందా?

క‌రోనా: అది చైనా ప్లేగు - ట్రంప్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని