ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్‌ కష్టమే: సీసీఎంబీ

ఈ ఏడాది కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ రావడం కష్టమేనని సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీ సంచాలకులు రాకేశ్‌ మిశ్రా అన్నారు. బహుశా వచ్చే ఏడాది తొలినాళ్లలో అందుబాటులోకి రావొచ్చని పేర్కొన్నారు. భారీస్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టాల్సి ఉంటుందని వెల్లడించారు....

Published : 05 Jul 2020 03:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ రావడం కష్టమేనని సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీ సంచాలకులు రాకేశ్‌ మిశ్రా అన్నారు. బహుశా వచ్చే ఏడాది తొలినాళ్లలో అందుబాటులోకి రావొచ్చని పేర్కొన్నారు. భారీస్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఆగస్టు 15 లోపు కరోనా సూదిమందును ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎస్‌ఐఆర్‌ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్‌ ప్రక్రియ వివిధ దశల్లో జరుగుతుంది కాబట్టి అదెలా సాధ్యమని కొన్ని వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. కొందరైతే విమర్శలకు దిగారు.

‘అన్నీ పుస్తకాల్లో ఉన్నట్టే కచ్చితత్వంతో జరిగితే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో వస్తుందని, మన చేతుల్లో వ్యాక్సిన్‌ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ సంఖ్యలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరపాల్సి ఉంటుంది. అనారోగ్యం ఉన్నవారికి మందుబిళ్ల ఇచ్చి తగ్గిందా లేదా అని చూసేందుకు ఇదేమీ డ్రగ్‌ కాదు’ అని మిశ్రా అన్నారు.

‘నిజానికి వ్యాక్సిన్ల అభివృద్ధికి చాలా ఏళ్లు పడుతుంది. కానీ మనమిప్పుడు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం. వ్యాక్సిన్‌ మెరుగ్గా పనిచేస్తే వచ్చే ఏడాది తొలినాళ్లలో రావొచ్చు. అంతకన్నా ముందైతే రాదు. నేను అర్థం చేసుకున్నంత వరకు అంతకన్నా ముందైతే రావడం కష్టం’ అని మిశ్రా తెలిపారు. ప్రస్తుతం రోజుకు 400-500 కరోనా టెస్టులు చేస్తున్నామని అన్నారు. ఇంతకన్నా తక్కువ సమయంలో, తక్కువ మందితో, తక్కువ ధరలో, ఎక్కువ టెస్టులు చేసే విధానాన్ని తాము ఐసీఎంఆర్‌కు ప్రతిపాదించామని పేర్కొన్నారు. అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని