రూ.కోట్ల విలువైన బంగారం పట్టివేత

బంగారం స్మగ్లింగ్‌ భారీ కుంభకోణం బయపడింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి వచ్చిన కంజైన్‌మెంట్‌లో..

Published : 05 Jul 2020 22:43 IST

తిరువనంతపురం: బంగారం స్మగ్లింగ్‌ భారీ కుంభకోణం బయపడింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి వచ్చిన కన్‌సైన్‌మెంట్‌ నుంచి దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈమధ్యకాలంలో ఇంత మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం అధికారులు పేర్కొంటున్నారు. స్మగ్లింగ్‌పై పక్కా సమాచారం అందుకున్న అధికారులు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొంది తనిఖీలు చేసింది. ‘నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారంతోనే దాడులు చేశాం. తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా బంగారం బయటపడే అవకాశం ఉంది’ అని  కేరళ, లక్షద్వీప్ ప్రాంత కస్టమ్స్ ఇన్‌ఛార్జి కమిషనర్ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. 

కన్‌సైన్‌మెంట్‌ ఓ ఛార్టెడ్‌ విమానం ద్వారా కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకుంది. కన్‌సైన్‌మెంట్లకు సాధారణంగా ఎలాంటి తనిఖీలు నిర్వహించరు. స్మగ్లింగ్ సిండికేట్ దీనినే అదునుగా భావించి కొంతమంది దిగువ స్థాయి ఉద్యోగులను బంగారం అక్రమ రవాణాకు ఉపయోగించుకుంటోందని కస్టమ్స్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పట్టుబడ్డ బంగారం విలువ రూ.కోట్లలో ఉంటుందని గృహోపకరణాల మధ్య దాచి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని కమిషనర్‌ పేర్కొన్నారు. తనిఖీ చేయాల్సి సరుకు ఇంకా ఉందని మరింత బంగారం బయపటపడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.
దేశీయంగా పసిడి ధర ఆకాశాన్నంటడంతో స్మగ్లింగ్‌ భూతం రెక్కలు విచ్చుకుంది. తూర్పు మధ్య దేశాలనుంచి వచ్చిన ఛార్టెడ్‌ విమానాల నుంచి గత రెండు వారాల్లోనే 15 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని