ఉద్రిక్తతల తగ్గింపులో పురోగతి: చైనా

గల్వాన్ ఘటన అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా పురోగతి సాధించినట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. జూన్‌ 30ప జరిగిన కమాండర్‌ స్థాయి చర్చల్లో .........

Published : 06 Jul 2020 19:05 IST

బీజింగ్‌: గల్వాన్ ఘటన అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా పురోగతి సాధించినట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. జూన్‌ 30ప జరిగిన కమాండర్‌ స్థాయి చర్చల్లో  ఇరు దేశాలు బలగాల ఉపసంహరణకు అంగీకరించినట్లు వెల్లడించింది. సరిహద్దుల్లో చైనా బలగాలు వెనుతిరిగాయని భారత సైనిక వర్గాల పేర్కొన్న కొన్ని గంటల్లోనే చైనా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ‘‘జూన్‌ 30న భారత్‌-చైనా సైనిక వర్గాలు కమాండర్‌ స్థాయిలో చర్చలు జరిపాయి. అంతకుముందు జరిగిన రెండు దఫాల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నాం. ఉభయ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా పురోగతి సాధించాం. సైనిక, దౌత్య మార్గాల ద్వారా సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకునేందుకు భారత్‌ సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ఆ దిశగా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ ప్రకటించారు.

గల్వాన్‌ ఘటన తర్వాత వాస్తవాధీన రేఖ వెంట భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు భారీ స్థాయిలో సరిహద్దులో బలగాల్ని మోహరించాయి. కానీ, జూన్ 30న జరిగిన చర్చల అనంతరం ఇరు దేశాల బలగాలు అక్కడి నుంచి వెనక్కి తగ్గేందుకు నిర్ణయించాయి. అందులో భాగంగా చైనా బలగాలు గల్వాన్‌ లోయ నుంచి 1.5 కి.మీ వెనక్కి వెళ్లినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన గుడారాలను కూడా చైనా తొలగించినట్లు పేర్కొన్నాయి. భారత దళాలు సైతం ఒక కి.మీ మేర వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి..
చైనా బ‌ల‌గాలు వెన‌క్కి..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని