
రంగంలోకి దోబాల్ వెనక్కి తగ్గిన చైనా
దిల్లీ: గల్వాన్ లోయ తమదేనంటూ బీరాలు పలుకుతూ..దాదాపు రెండు నెలలపాటు భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది డ్రాగన్ దేశం. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో భారతీయ సైనికులు 20 మంది అమరులయ్యారు, పలువురు గాయపడ్డారు. ఈ పరిణామాల అనంతరం ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా బలగాలు తొలిసారిగా ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి కిలోమీటరు దూరం వెనక్కి వెళ్లాయి. దీనికి కారణం ఏంటి.. భారత్‌తో ఢీ అంటే ఢీ అన్న చైనా ఎందుకు వెనకడుగు వేసింది. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నా వెనకడుగు వేయని చైనాపై భారత్ ఏవిధంగా ఒత్తిడి పెంచింది అంటే సమాధానం ఒక్కటే.. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోబాల్.
ఆదివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రెండు గంటలపాటు దోబాల్ వీడియోకాల్‌లో మాట్లాడినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇరుదేశాలు వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) గౌరవిస్తూ, గమనిస్తుండాలని.. అలానే వాస్తవ పరిస్థితులను మార్చేందుకు ఏ దేశం ఏకపక్ష చర్యలకు ఉపక్రమించకూడదని ఇరు దేశాల మధ్య అంగీకారం జరిగినట్లు సమాచారం. ఎల్ఏసీ వెంట ఉన్న సైనిక బలగాలను వీలైనంత త్వరగా అక్కడ నుంచి ఉపసంహరించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
‘‘ఎన్ఎస్ఏ అజిత్ దోబాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీలు పశ్చిమ ప్రాంతంలో నెలకొన్న వాస్తవ పరిస్థితుల గురించి ఇరువురు చర్చించడం జరిగింది. శాంతి పునరుద్ధరణ కోసం ఎల్ఏసీ వెంట ఉన్న సైనిక బలగాలను పూర్తిస్థాయిలో సరిహద్దుల నుంచి వెనక్కి రప్పించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు’’ అని విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ చర్చల అనంతరం గల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి చైనా బలగాలు ఒక కిలోమీటరు మేర వెనక్కి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ లద్దాఖ్‌లో పర్యటించి చైనాకు పరోక్షంగా గట్టి సందేశాన్ని పంపారు. తమ భూభాగాలను ఆక్రమించాలని చూస్తే భారత్ ధీటుగా బదులిస్తుందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు..
ఇదీ చదవండి..