'హెర్డ్ ఇమ్యూనిటీ'పై స్పెయిన్ ఏమ‌న్నదంటే..!

విశ్వ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తోన్న కరోనా వైర‌స్ మ‌హమ్మారిపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే ఈ స‌మ‌యంలో 'హెర్డ్ ఇమ్యూనిటీ' ద్వారా ఈవైర‌స్ నుంచి విముక్తి పొందవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ, ఇప్ప‌టివ‌రకు అనుకున్న స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించ‌లేద‌ని స్పెయిన్ ప‌రిశోధన‌ల్లో వెల్ల‌డైంది.

Published : 07 Jul 2020 17:09 IST

70వేల మందిపై ప‌రిశోధ‌న‌ అనంత‌రం నివేదిక‌

మాడ్రిడ్‌: విశ్వ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తోన్న కరోనా వైర‌స్ మ‌హమ్మారిపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే ఈ స‌మ‌యంలో 'హెర్డ్ ఇమ్యూనిటీ' ద్వారా ఈవైర‌స్ నుంచి విముక్తి పొందవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ, ఇప్ప‌టివ‌రకు అనుకున్న స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించ‌లేద‌ని స్పెయిన్ ప‌రిశోధన‌ల్లో వెల్ల‌డైంది. అక్క‌డి జ‌నాభాలో కేవలం 5శాతం ప్ర‌జల్లో మాత్రమే క‌రోనా వైర‌స్ యాంటీబాడీస్ వృద్ధిచెందిన‌ట్లు నిరూపిత‌మైంది.

జ‌నాభాలో ఎక్కువ మంది వైర‌స్‌ను త‌ట్టుకునే శ‌క్తిని క‌లిగి ఉండ‌టాన్ని 'హెర్డ్ ఇమ్యూనిటీ'గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ శ‌క్తిని సాధించాలంటే జ‌నాభాలో క‌నీసం 60శాతం మంది వైర‌స్ నుంచి కోలుకొని ఉండ‌ట‌మో లేదా వ్యాక్సిన్ ద్వారా సాధించ‌డ‌మో జ‌ర‌గాలని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి ధాటికి వ‌ణికిపోయిన స్పెయిన్ హెర్డ్ ఇమ్యూనిటీని తెలుసుకునేందుకు భారీ స్థాయిలో యాంటీబాడీల‌ ప‌రిశోధ‌నలు చేప‌ట్టింది. గ‌డిచిన మూడు నెలల్లో అక్క‌డ‌ దాదాపు 70వేల మందిని మూడుసార్లు ప‌రీక్షించింది. ఈ మూడు నెల‌ల కాలంలో వైర‌స్ తీవ్రతలో ఎలాంటి మార్పు క‌నిపించ‌లేద‌ని క‌నుగొంది. వైర‌స్‌ను ఎదుర్కొనే శ‌క్తి స్వ‌ల్ప‌కాల‌మేన‌ని.. ప‌రిశోధ‌న‌ల్లో పాల్గొన్న వారిలో దాదాపు 14శాతం మందికి తొలుత యాంటీబాడీస్ ఉన్న‌ప్ప‌టికీ త‌ర్వాతి కాలంలో వారు ఆ శ‌క్తి కోల్పోయిన‌ట్లు తేలింది. రోగ‌నిరోధ‌క శ‌క్తి తాత్కాలికంగా ఉండ‌డంతోపాటు కొంత‌కాలానికి అది పూర్తిగా అదృశ్యం అయ్యే అవ‌కాశం కూడా ఉంద‌ని ఈ అధ్య‌యనానికి ‌నాయ‌క‌త్వం వ‌హించిన డాక్ట‌ర్ రాక్వెల్ యొట్టి స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టివ‌రకు స్పెయిన్‌లో 5.2శాతం మందికి క‌రోనా వైర‌స్ సోకింద‌ని తెలిపారు. మిగ‌తా 95శాతం ప్ర‌జ‌లు ఈ వైర‌స్ బారిన‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు‌. ఈ స‌మయంలో స్పెయిన్ ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతోపాటు సాధ్య‌మైనంత‌వ‌రకు ఇంటికే ప‌రిమితం కావాల‌ని సూచించారు.

హెర్డ్ ఇమ్యూనిటీపై కొన‌సాగుతున్న ప‌రిశోధ‌న‌లు..

వైర‌స్‌ను త‌ట్టుకునే హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయిపై ప‌లుదేశాల్లో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ స‌మ‌యంలో ఎక్క‌వ జ‌నాభాకు వైర‌స్ సోక‌డం ద్వారా వైర‌స్ ప్రాభ‌ల్యంలో మార్పును అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే అమెరికా, చైనాల్లో దీనిపై విస్తృతంగా ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నారు. వైర‌స్ స‌హ‌జ సంక్ర‌మ‌ణ ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తామ‌నే ప్ర‌తిపాద‌‌న‌లు అనైతికం కాన‌ప్ప‌టికీ, ఇవి అసాధ్య‌మ‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన శాస్త్రవేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వివిధ దేశాల్లో జ‌రుగుతున్న‌ తాజా ప‌రిశోధ‌న‌లు కూడా ఇదే విష‌యాన్ని రుజువు చేస్తున్నాయ‌ని ప్రముఖ వైరాల‌జస్ట్ ఇస‌బెల్లా ఎకెర్లే స్ప‌ష్టం చేశారు.

శ‌రీరంలో వైర‌స్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నంత‌ మాత్రాన వారు మ‌ళ్లీ వైర‌స్ బారినప‌డ‌ర‌నే విష‌యంపై ఇంకా వైద్యుల్లోనే అనిశ్చితి నెల‌కొంది. అంతేకాకుండా వైర‌స్ నుంచి యాంటీబాడీలు ఎంతవ‌ర‌కు ర‌క్షిస్తాయ‌నే విష‌యంపైనా స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే, స్సెయిన్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 2,98,869 పాజిటివ్ ‌కేసులు న‌మోదుకాగా వీరిలో ఇప్ప‌టివ‌రకు 28వేల మంది మృత్యువాత‌ప‌డ్డారు.

ఇవీ చ‌ద‌వండి..
మ‌హ‌మ్మారి ముప్పు ఇప్ప‌ట్లో ముగిసిపోదు..
రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గుద‌ల ల‌క్ష‌ణాలివే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని