ఓలీ..మేమున్నాం..

ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలిని కాపాడేందుకు...

Published : 07 Jul 2020 23:49 IST

కాఠ్‌మాండూ: ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలిని కాపాడేందుకు చైనా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ మేరకు నేపాల్‌లోని చైనా రాయబారి హో యాంకీ నేపాల్ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్‌సీపీ) నేత ఝల్‌ నాథ్‌ ఖనాల్‌ను కలిసి ప్రధాని ఓలికి మద్దతు తెలపాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  కొద్ది రోజుల క్రితం హో యాంకీ నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యదేవి భండారీతో పాటు, ఎన్‌సీపీ నేతలు ప్రచండ, మాధవ కుమార్‌ నేపాల్‌ను కలిసి మంతనాలు జరిపినట్లు స్థానిక వార్త సంస్థలు వెల్లడించాయి. అయితే ఓలి రాజీనామాకు తీవ్రంగా ప్రచండ తీవ్రంగా పట్టుబట్టుతున్న విషయం తెలిసిందే. 

మరోవైపు నేపాల్ అంతర్గత రాజకీయాల్లో చైనా జోక్యంపై విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎన్‌సీపీ నేతలతో హో యాంకీ సమావేశమవటాన్ని చైనా రాయబార కార్యాలయం సమర్థించుకుంది.  ఈ మేరకు రాయబార కార్యాలయ ప్రతినిధి ఝాంగ్ సీ మాట్లాడుతూ ‘‘ఎన్‌సీపీ పార్టీ ఇబ్బందులకు గురవ్వాలని చైనా కోరుకోవడంలేదు. ఆ పార్టీ నాయకులు తమ విభేదాలను పరిష్కరించుకుని ఐకమత్యంగా ఉండాలని చైనా ఆశిస్తుంది. రాయబార కార్యాలయం నేపాల్‌ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉంది. ఆసక్తికరమైన అంశాలపై వారితో అభిప్రాయాలను పంచుకునేందుకు రాయబార కార్యాలయం సిద్ధంగా ఉంది’’ అని స్థానిక వార్తా ప్రతికతో పేర్కొన్నారు.

భారత భూభాగాన్ని తమదిగా చూపుతూ సవరించిన చిత్రపటాన్ని నేపాల్‌ పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పార్టీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. ఏకపక్ష నిర్ణయాలు, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఓలి రాజీనామా  చేయాలని ఎన్‌సీపీ ముఖ్య నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నేపాల్‌లోని భారత దౌత్య కార్యాలయం కుట్ర పన్నుతోందని ఓలీ విమర్శించారు. భారత ప్రాంతాలను చూపుతూ నేపాల్‌ రేఖా చిత్రపటాల సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని