వికాస్‌దూబే ప్రధాన అనుచరుడి ఎన్‌కౌంటర్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల్ని పొట్టనబెట్టుకున్న మోస్ట్‌వాంటెడ్‌ రౌడీషీటర్‌ వికాస్‌ దూబే ప్రధాన అనుచరుడు అమర్‌ దూబేను పోలీసులు  ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో..........

Updated : 22 Dec 2022 17:17 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల్ని పొట్టనబెట్టుకున్న మోస్ట్‌వాంటెడ్‌ రౌడీషీటర్‌ వికాస్‌ దూబే ప్రధాన అనుచరుడు అమర్‌ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ హమీర్‌పూర్‌ జిల్లాలోని ఓ ప్రాంతంలో అతడు తలదాచుకున్న విషయాన్ని తెలుసుకున్న యూపీ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు బుధవారం ఉదయం అతణ్ని పట్టుకోవడానికి వెళ్లగా ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. అమర్‌ దూబేపై రూ. 25 వేల రివార్డు ఉందని తెలిపారు. 

కాన్పూర్‌లో గత గురువారం వికాస్‌ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి పరారీ ఉన్న వారి కోసం పోలీసులు 40 ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వేసి ఉంచారు. 

అయితే, వికాస్ దూబే మంగళవారం హరియాణాలోని ఫరీదాబాదులోని ఓ హోటల్లో కనిపించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేయగా.. అప్పటికే అతడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు  అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. దీంతో దిల్లీ, గురుగ్రామ్‌ నగరాల పోలీసుల్ని సైతం అప్రమత్తం చేశారు. అలాగే బిజ్‌నౌర్‌ పట్టణంలో ఓ కారులో వికాస్‌ దూబే మంగళవారం కనిపించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ నగరాన్ని పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారు. అలాగే సరిహద్దు రాష్ట్రమైన ఉత్తరాఖండ్ పోలీసుల్ని కూడా అప్రమత్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని