2021 నాటికి 25కోట్ల మందికి క‌రోనా!

ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోన్న క‌రోనా వైర‌స్ మహ‌మ్మారి ముప్పు ఇప్ప‌ట్లో ముగిసిపోద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఈమ‌ధ్యే స్ప‌ష్టం చేసిన విష‌యం ...

Published : 08 Jul 2020 11:50 IST

ఎంఐటీ శాస్త్రవేత్త‌ల‌‌ అంచనా

దిల్లీ: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోన్న క‌రోనా వైర‌స్ మహ‌మ్మారి ముప్పు ఇప్ప‌ట్లో ముగిసిపోద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఈమ‌ధ్యే స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోటి ప‌దిల‌క్ష‌ల మందికి సోకిన ఈ మ‌హ‌మ్మారి, దాదాపు ఐదున్న‌ర ల‌క్ష‌ల మందిని పొట్ట‌న‌పెట్టుకుంది. అయితే, ఈ పాజిటివ్ కేసుల‌ సంఖ్య ప్ర‌స్తుతం న‌మోదైన దానికంటే దాదాపు 12రెట్లు ఎక్కువ‌గానే ఉండ‌వ‌చ్చ‌ని మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎంఐటీ) శాస్త్రవేత్త‌లు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా మ‌ర‌ణాల సంఖ్య కూడా రెట్టింపు ఉండొచ్చ‌ని అంటున్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌తోపాటు మాన‌వ జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తోన్న ఈ మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థంగా క‌ట్ట‌డిచేయ‌కుంటే 2021 మార్చి నాటికి 25కోట్ల మంది ఈ వైర‌స్ బారిన‌ప‌డ‌డంతోపాటు 18ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్న‌ట్లు ఎంఐటీ శాస్త్రవేత్త‌లు అంచ‌నా వేశారు. 

నిర్ధార‌ణ ప‌రీక్ష‌లతోనే నియంత్ర‌ణ‌..

అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని క‌ట్టడి చేసేందుకు నిర్ధార‌ణ పరీక్ష‌లు ఎంత‌గానో దోహ‌దంచేస్తాయ‌ని ఎంఐటీ శాస్త్రవేత్త‌లు పున‌రుద్ఘాటించారు. అంతేకాకుండా ప్ర‌స్తుతం దీన్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి ఔష‌ధాలు, టీకాలు అందుబాటులో లేక‌పోవడంతో ప‌రిశుభ్ర‌త‌, భౌతిక దూరం, మాస్కులు ధ‌రించ‌డంతోనే వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. మార్చి మ‌ధ్య‌కాలం నుంచి ఆయా దేశ‌ జ‌నాభాలో నిత్యం 0.1శాతం మందికి కరోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు చేసివుంటే ల‌క్ష‌ల సంఖ్య‌లో వైర‌స్ కేసులు తగ్గించే అవకాశం ఉండేద‌ని ఎంఐటీ శాస్త్రవేత్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

భార‌త్‌లో నిత్యం 2ల‌క్ష‌ల కేసులు..?
క‌రోనా వ్యాక్సిన్‌, ఔష‌ధాల‌పై పురోగ‌తి క‌నిపించ‌కుంటే 2021నాటికి కేసుల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ఎంఐటీ శాస్త్రవేత్త‌లు అంచనా వేశారు. అత్య‌ధికంగా భార‌త్‌లో నిత్యం 2.8ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. అంతేకాకుండా అమెరికాలో 95,000, ద‌క్షిణాఫ్రికాలో 21,000, ఇరాన్‌లో 17,000 కేసులు న‌మోదు కావచ్చని ప‌రిశోధ‌కుల అంచ‌నా. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 475కోట్ల జ‌నాభా క‌లిగిన 84దేశాల‌(భార‌త్‌తోపాటు, చైనా మిన‌హా) స‌మాచారాన్ని విశ్లేషించిన‌ట్లు ఎంఐటీ ప్రొఫెస‌ర్లు హ‌జీర్ ర‌హ్మాన్‌దాద్‌, జాన్ స్టెర్మాన్ వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్ తీవ్ర‌త‌, నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, మ‌ర‌ణాల సంఖ్య, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌, ఆసుప‌త్రుల సామ‌ర్థ్యం, విధాన నిర్ణ‌యాలు, సామాజిక వైఖ‌రుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ అంచ‌నాల‌కు వ‌చ్చామ‌ని తెలిపారు. ఇదిలాఉంటే, అమెరికాలో ఈ వైర‌స్ ప్ర‌భావం ప్ర‌స్తుతం బ‌య‌ట‌ప‌డుతున్న దానికంటే ప‌దిరెట్లు ఎక్కువ‌గానే ఉండ‌వ‌చ్చ‌ని అమెరికా వ్యాధి నియంత్ర‌ణ‌, నిర్మూల‌న కేంద్రం(సీడీసీ) ఈమ‌ధ్యే వెల్ల‌డించింది.

ఇవీ చ‌ద‌వండి..
భార‌త్‌: వారంలో ల‌క్షా 60వేల కేసులు, 3242మ‌ర‌ణాలు
'హెర్డ్ ఇమ్యూనిటీ'పై స్పెయిన్ ఏమ‌న్న‌దంటే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని