‘‘అవసరమైతే వైద్యబృందాలు పంపిస్తామన్నారు’’

హైదరాబాద్‌ ప్రజల ఆందోళనను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి వివరించాను.

Published : 08 Jul 2020 19:53 IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి

దిల్లీ: ‘‘హైదరాబాద్‌ ప్రజల ఆందోళనను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి వివరించాను. తెలంగాణకు అన్ని విధాలా సాయం చేస్తామని ఆయన చెప్పారు’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కిషన్‌ రెడ్డి కలిసి తెలంగాణలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై చర్చించారు. అనంతరం కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని అన్నారు. 

‘‘హైదరాబాద్‌, పరిసర జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రికి చెప్పాను. అవసరమైతే వైద్య బృందాలను పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లాక్‌డౌన్‌, కంటైన్మెంట్‌ జోన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. తెలంగాణకు కేంద్రం 7,14,000 ఎన్-95 మాస్కులు, 2,41,000 పీపీఈ కిట్లు, సుమారు 23 లక్షల హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్లు పంపించింది. రాష్ట్రంలో వెంటిలేటర్ల కొరత గురించి కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పటివరకు 680 వెంటిలేటర్లు పంపగా, మరో 1,220 వెంటిలేటర్లను పంపించేందుకు హర్షవర్ధన్ అంగీకారం తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 487 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం వినియోగించడం లేదు. దిల్లీ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించాలి. తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసి కరోనా రోగులకు పడకల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేస్తున్నారు.. దీనిని నివారించాలి’’ అని కిషన్‌ రెడ్డి అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని