‘సిలబస్‌ నుంచి ఈ అంశాల్ని తొలగిస్తారా?’

సిలబస్‌ తగ్గింపులో భాగంగా ప్రజాస్వామ్య హక్కులు, సమాఖ్య విధానం, లౌకికవాదం వంటి కీలక అంశాల్ని పాఠ్యాంశాల నుంచి తొలగించడం తనను షాక్‌ గురిచేసిందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు..........

Published : 08 Jul 2020 23:49 IST

కీలకాంశాల తొలగింపుపై విపక్షాల అభ్యంతరం

కోల్‌కతా: సిలబస్‌ తగ్గింపులో భాగంగా ప్రజాస్వామ్య హక్కులు, సమాఖ్య విధానం, లౌకికవాదం వంటి కీలక అంశాల్ని పాఠ్యాంశాల నుంచి తొలగించడం తనను షాక్‌ గురిచేసిందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమైన అంశాల్ని సిలబస్‌ నుంచి తొలగించుకుండా చూడాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను కోరారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరునంతపురం ఎంపీ శశి థరూర్ సైతం ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ సిలబస్‌ నుంచి కీలకాంశాల్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్న వారి ఉద్దేశాల్ని శంకించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం, వైవిధ్యత, లౌకికవాదం వంటి అంశాలు భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అంశాలు కాదని భావించారా?’’ అని ట్విటర్‌ వేదికంగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెందిన మరో నేత జైరాం రమేశ్‌ మాట్లాడుతూ..  ‘‘మొత్తం రాజనీతి శాస్త్రంపైనే డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనుకుంటున్న ఓ వ్యక్తి నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం’’ అని పరోక్షంగా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. 

కరోనా కారణంగా పాఠశాలలు నడవని పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరానికి 9 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. విద్యార్థుల అభ్యాస లక్ష్యాల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన అంశాలను యథాతథంగా ఉంచుతూనే 9-12 తరగతుల సిలబస్‌ను 30శాతం వరకు హేతుబద్ధీకరించాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ మంగళవారం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని