మన పర్యాటక ప్రదేశాల్లో షూటింగులు జరపండి

ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌లో భాగంగా చిత్ర పరిశ్రమ వర్గాలు పురావస్తుశాఖ పరిధిలోని ప్రదేశాల్లో షూటింగ్‌లు జరపాలని...

Published : 10 Jul 2020 01:16 IST

చిత్ర పరిశ్రమకు కేంద్ర మంత్రి అభ్యర్ధన  

దిల్లీ: ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌లో భాగంగా చిత్ర పరిశ్రమ వర్గాలు పురావస్తుశాఖ పరిధిలోని (ఏఎస్‌ఐ) ప్రదేశాల్లో షూటింగ్‌లు జరపాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్ చిత్ర పరిశ్రమను కోరారు.  ఈ మేరకు షూటింగులకు అవసరమైన అనుమతులను దరఖాస్తు చేసుకున్న 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మంజూరు చేస్తామని తెలిపారు.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ వర్గాలు విదేశాలకు వెళ్లి షూటింగులు జరపడం కష్టం. అందుకే వారు షూటింగ్ లోకేషన్ల కోసం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాలని సూచిస్తున్నాం. అలా చేయడం వల్ల దేశంలోని వివిధ ప్రదేశాలను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి నెరవేరినట్లవుతుంది. షూటింగ్ కోసం వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 నుంచి 20 రోజుల్లో అనుమతులు ఇస్తాం. జనసాంద్రత ఎక్కువగా ఉండే పర్యాటక ప్రాంతాలు కాకుండా తక్కువ జనాదరణ కలిగిన ప్రాంతాల్లో షూటింగులు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ఫిక్కి సదస్సులో పటేల్  అన్నారు.

కరోనా కట్టడిలో భాగంగా కొంత కాలం పాటు పర్యాటక ప్రదేశాలను మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తర్వాత  ఏఎస్‌ఐ పరిధిలోని మూడువేల పర్యాటక ప్రదేశాలను తిరిగి తెరిచారు. మిగిలిన వాటిని మాత్రం మూసి ఉంచారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏఎస్ఐ పరిధిలోని ప్రదేశాల్లో షూటింగులకు అనుమతి ఉందని, అయితే దాని కోసం ఎంతో పేపర్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

‘‘చిత్ర పరిశ్రమ ఏఎస్‌ఐ ప్రదేశాల్లో షూటింగులు చేసుకునేందుకు సాంస్కృతిక పర్యాటక శాఖ అన్ని రకాల సహాయ సహాకారలను అందిస్తుంది. అవసరమైతే ఐటీ మంత్రిత్వ శాఖ సహాయం కూడా తీసుకుంటాం. భారత దేశంలోలా ఏదీ అందంగా లేదు. మన ప్రాచీన సంస్కృతి గురించి ప్రజలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన దేశాన్ని, ఇక్కడి ప్రదేశాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’’ అని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం షూటింగులకు అనుమతి కోసం ప్రతిపాదిత తేది నుంచి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని