
చైనాకు బయలుదేరిన WHO నిపుణుల బృందం!
తొలుత ఇద్దరు నిపుణులు చైనాకు..
పూర్తి దర్యాప్తు బృందంపై కసరత్తు - డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మూలాలపై పూర్తి దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముందస్తు నిపుణుల బృందం చైనాకు బయలుదేరింది. ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన ఈ మహమ్మారి చైనాలోని వుహాన్ నగరంలో ఓ మాంసహార విక్రయశాలలో బయటపడినట్లు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ మూలాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం ఇక పూర్తి దర్యాప్తు చేయనుంది.
‘‘జంతు ఆరోగ్యం, ఎపిడెమియాలజీలో నిష్ణాతులైన ఇద్దరు డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం నేడు చైనా బయలుదేరింది. తొలుత వీరు దర్యాప్తు పరిధితోపాటు పరిశోధనకు పట్టే సమయాన్ని చైనా శాస్త్రవేత్తలతో కలిసి అంచనా వేస్తారు. అంతేగాకుండా పూర్తి బృందంలో ఎంతమంది పాల్గొనాలి? ఎలాంటి నైపుణ్యాలు ఉన్నవారు ఈ పరిశోధనలో పాల్గొనాలి? అనే దానిపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు’’ అని డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ వెల్లడించారు. అయితే కరోనా మహమ్మారి పర్యవేక్షణపై ఏర్పాటు చేసిన ఈ స్వతంత్ర దర్యాప్తు బృందంలో డబ్ల్యూహెచ్‌వో పాత్ర ఉండదని మార్గరెట్ హారిస్ స్పష్టం చేశారు.
‘‘కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ ఉద్భవించిందనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అది తెలుసుకునేందుకే జంతు ఆరోగ్య నిపుణుడిని పంపిస్తున్నాం. ఈ వైరస్ జంతు జాతుల నుంచి మానవులకు సోకిందా? ఏ జాతుల నుంచి సోకిందనే విషయం తెలుస్తుంది. అంతేకాకుండా గబ్బిలాల్లో కనిపించే వైరస్‌తో పోలికలున్న ఈ వైరస్ మధ్యంతర జాతుల నుంచి మానవులకు ఎలా సంక్రమించిందనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది’’ అని మార్గరెట్ హారిస్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి వుహాన్‌లోని ల్యాబ్‌లో సృష్టించారని అమెరికా పలుసార్లు ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ అమెరికా అధికారులు ప్రకటించారు. వీటికితోడు ఈ కరోనా మహమ్మారి గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని చాలాదేశాలు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు సిద్ధమైంది.
ఇవీ చదవండి..
వుహాన్ లేబొరేటరీలో ఏం జరిగింది?
చైనా వంచన విధానమే ప్రపంచాన్ని ముంచింది!
Advertisement