
కజక్ న్యూమోనియా కరోనా కావొచ్చు:WHO
ఇంటర్నెట్ డెస్క్: కజక్‌స్థాన్‌లో గుర్తుతెలియనిదిగా భావిస్తున్న న్యూమోనియాకు కరోనా వైరసే కారణం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ మైకేల్ రేయాన్ అన్నారు. గతవారం ఆ దేశం ప్రయోగశాలల్లో ధ్రువీకరించిన 10వేల కొవిడ్-19 కేసులను నమోదు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ 50వేలకు పైగా కేసులు ఉండటం గమనార్హం.
కొవిడ్ కన్నా ప్రమాదకరమైన న్యూమోనియా కజక్‌స్థాన్‌లో మరణమృదంగం మోగిస్తోందని చైనా తెలిపింది. ఆ దేశంలోని తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని చైనా రాయబార కార్యాలయం హెచ్చరించింది. కొత్తరకం న్యూమోనియాతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 1772 మంది మృతిచెందారని తెలిపింది. అయితే వీటిని కజక్‌స్థాన్ కొట్టిపారేసింది.
‘మేం అక్కడి టెస్టుల ప్రక్రియ, నాణ్యతను పరిశీలిస్తాం. పరీక్షల ఫలితాలు తప్పుగా వస్తున్నాయేమో గమనిస్తాం’ అని రేయాన్ అన్నారు. చాలా న్యూమోనియా కేసులకు కరోనాయే కారణమని భావిస్తున్నామన్నారు. నిర్ధారణ సరిగ్గా చేయడం లేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో ఎక్స్‌రేలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఇప్పటికే కజక్‌స్థాన్‌లో ఉందని పేర్కొన్నారు.