మరో అడుగు వెనక్కి..?

డ్రాగన్‌ మెల్లగా దారికొస్తోంది.. సరిహద్దుల్లో ఉద్రికత్తలకు తెరితీస్తే.. భారత్‌ వ్యాపారంలో.. భౌగోళిక రాజకీయ సమీకరణలతో చైనాకు జవాబిచ్చింది.  ఆ ఫలితం మెల్లగా కనిపిస్తోంది. తాజాగా భారత్‌-చైనా సరిహద్దుల్లో

Published : 12 Jul 2020 11:37 IST

 పాంగాంగ్‌ సరస్సు వద్ద వైదొలగుతున్న చైనా

 భారత్‌కూ ఇబ్బందికర పరిస్థితి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

డ్రాగన్‌ మెల్లగా దారికొస్తోంది.. సరిహద్దుల్లో ఆ దేశం ఉద్రికత్తలకు తెరితీస్తే.. భారత్‌ వాణిజ్య, భౌగోళిక రాజకీయ సమీకరణలతో చైనాకు జవాబిచ్చింది.  ఆ ఫలితం మెల్లగా కనిపిస్తోంది. తాజాగా భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా  కీలకమైన పాంగాంగ్‌ సరస్సు వద్ద నుంచి కూడా చైనా బలగాలను వెనక్కి తీసుకొంటోంది. ఇప్పటికే అక్కడ మోహరించిన పడవల సంఖ్యను గణనీయంగా తగ్గించేసింది.  మరోపక్క లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల చర్చలు కొనసాగుతున్నాయి.  పాంగాంగ్‌ సో, డిప్సాంగ్‌ ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకునే అంశంపై ఇరు పక్షాలు కసరత్తు చేస్తున్నాయి.  వాస్తవానికి ఈ సరస్సు వద్ద ఉన్న ఫింగర్‌ 4 నుంచి దళాలు వైదొలగడం అత్యంత కీలకం.

గల్వాన్ లోయలో ఇరు పక్షాలు వెనక్కి..

జూన్‌లో ఘర్షణ చోటు చేసుకొన్న పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 నుంచి ఇప్పటికే ఇరు బలగాలు రెండేసి కిలోమీటర్లు చొప్పున వెనక్కి తగ్గాయి. దీంతోపాటు గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతాల్లో వెనక్కి తగ్గుతున్నాయి.  వీటిపై గతవారం భారత ఎన్‌ఎస్‌ఏ , చైనా విదేశాంగశాఖ మంత్రి చర్చలు జరిపారు.  దీంతో పాంగాంగ్‌సో సరస్సుపై పూర్తిగా దృష్టిపెట్టారు. ఫింగర్‌4 నుంచి చైనా బలగాలు ఫింగర్‌ 8 వద్దకు పంపడం కొంచెం కష్టమే.  ఇప్పటికైతే చైనా దళాలు ఫింగర్‌4 నుంచి 5 వరకు వెనక్కి తగ్గొచ్చు.  భారత్‌ కూడా ఫింగర్ 3 వరకు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. దీనికోసం భారత్‌ కూడా కొంత భాగం వెనక్కి రావాల్సి ఉంటుంది.  అసలు తొలి ఘర్షణ జరిగింది ఇక్కడే కావడం గమనార్హం. 

ఈ సరస్సు టిబెట్‌ వరకు 604 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది.  వాస్తవాధీన రేఖ ఈ సరస్సుమీద నుంచి పోతుంది. ఈ సరస్సు ఉత్తర తీరాన బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఇరు దేశాల సైన్యాలు  ‘ఫింగర్స్‌’గా అభివర్ణిస్తాయి. ఈ వేళ్ల దగ్గర లెక్కలే ప్రస్తుతం వివాదానికి కారణంగా మారాయి. భారత్‌ ‘ఫింగర్‌ 8’ నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని చెబుతుంది.. భౌతికంగా మాత్రం ఫింగర్‌ 4 వరకే పట్టు ఉంది. కానీ చైనా సైన్యానికి ఫింగర్‌ 8 వద్ద సరిహద్దు పోస్టు ఉంది.. అయినా ఫింగర్‌ 2 వరకు తమదే అని వాదిస్తోంది.  భారత్‌కు ‘ఫింగర్‌4’ చాలా వ్యూహాత్మకమైంది. ఇక్కడికి శత్రుబలగాలు వస్తే భారత్‌ పాంగాంగ్‌ సరస్సులో గస్తీకి వినియోగించే బోట్ల సంఖ్య, వాటి వద్ద మన సైన్యం కదలికలు శత్రువులకు తేలిగ్గా తెలిసిపోతాయి. ఫింగర్‌ 4 నుంచి చూస్తే భారత్‌ మరపడవలను నిలిపే లుకుంగ్‌ ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది.

నిస్సైనిక ప్రాంతాలుగా..

హాట్‌స్ప్రింగ్స్‌లో ఇప్పటికే ఇరు బలగాలు కిలోమీటర్‌ మేరకు వెనక్కి వెళుతున్నాయి. నేటి సాయంత్రానికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు.  చాంగ్‌చెన్‌మో నది వద్ద ఉన్న ఈ ప్రాంతంలో ఇరు వర్గాలు పెట్రోలింగ్‌ కూడా నిర్వహించకూడదు. 
ప్రస్తుతం సైనిక దళాలు వెనక్కి తీసుకొనే అంశంలో కొన్ని ప్రదేశాల్లో చైనాకు లాభం చేకూరుతోందని రక్షణరంగ విశ్లేషకులు పేర్కొన్నారు.  పెట్రోలింగ్‌ పాయింట్‌ 15, పెట్రోలింగ్‌ 17ఏ వద్ద ఈ ఒప్పందాలతో చైనాకు కొంత లబ్ధిచేకూరే వీలుందని ఆంగ్ల పత్రిక బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక కథనం ప్రచురిచింది.  వాస్తవాధీన రేఖ దాటి చైనా భారత్‌లోకి ప్రవేశించింది. అవి వివాదాస్పదమైనప్పుడు చైనా ముందుకొచ్చిన మేరకు వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. కానీ, ఈ ఒప్పందాల్లో భారత్‌ కూడా వివాదాస్పద ప్రాంతం నుంచి కొంత వెనక్కి తగ్గడం ఇబ్బందికరంగా మారింది. చైనా వెనక్కి తగ్గినా.. అది వాస్తవాధీన రేఖ వద్దే ఉంటుంది.. భారత భూభాగంలో బఫర్‌ జోన్‌ను ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి ఇవి ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాత్కాలికంగా తీసుకొనే చర్యలు.. ఆ తర్వాత జరిగే చర్చల్లో ఈ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది.  ఇంకా చాలా పెట్రోలింగ్‌ పాయింట్ల వద్ద ఇరు వర్గాలు భారీగా దళాలను మోహరించే ఉన్నాయి. వీటిల్లో పీపీ18, 19, 20, 21, 22,23 ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని