నా వల్లకావడంలేదు..: బోల్సెనారో

తిట్టే నోరు, తిరిగే కాలు ఊరకుండవు అన్నట్లుంది బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారోను చూస్తే. దేశాధ్యక్షుడి హోదాలో నిత్యం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు వార్తల్లో ఉండే

Updated : 14 Jul 2020 11:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తిట్టే నోరు, తిరిగే కాలు ఊరకుండవు అన్నట్లుంది బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారోను చూస్తే. దేశాధ్యక్షుడి హోదాలో నిత్యం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే ఆయనకు ఇప్పుడు కొవిడ్‌ ఐసోలేషన్‌లో ఉండటం చిరాగ్గా ఉంది. దీంతో మరోసారి కొవిడ్‌ టెస్ట్‌‌ చేయించుకోవాలని సోమవారం నిర్ణయించుకొన్నారు. దీనిపై ఇటీవల సీఎన్‌ఎన్‌ బ్రెజిల్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. 

‘‘నేను ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నాను. మంగళవారం మరోసారి కరోనా పరీక్ష ఉంది. దానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. నేను చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఈ రకంగా ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. భయంకరంగా ఉంది. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు. బాగానే ఉన్నాను. రేపు చేసే పరీక్ష ఫలితం ఎలా వస్తుందో తెలియదు. నేను మళ్లీ నా విధులను ప్రారంభించాలి. కానీ, నా చుట్టుపక్కల వారిని కూడా పట్టించుకోవాలిగా. అందుకే ఫలితం భిన్నంగా వస్తే మరికొన్ని రోజులు ఎదురుచూస్తాను. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్‌ల్లో విధులు చక్కబెడుతున్నాను ’’ అని ఆ ఫోన్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సెనారోపై కొవిడ్‌ ప్రభావం తక్కువగా ఉంది. ఆయనకు రుచి, వాసన పోలేదు. ప్రస్తుతం బ్రెజిల్‌లో కొవిడ్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే కొవిడ్‌కు అత్యధికంగా ప్రభావితమైన రెండో దేశంగా నిలిచింది. ఇక్కడ సోమవారం నాటికి 73వేల మంది కొవిడ్‌ కారణంగా మృతి చెందారు.  

బోల్సెనారో నిర్లక్ష్యమే కారణం..

కొన్ని నెలల క్రితం వరకు ఇక్కడ కరోనా పెద్దగా వ్యాపించలేదు. కట్టడి చర్యలు తీసుకోవాల్సిన సమయాన్ని వృథా చేయడంతో అక్కడ వైరస్‌ విజృంభించింది. చివరికి అమెజాన్‌ అడవుల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా పాకింది. అయినా అధ్యక్షుడి తీరులో మార్పు రాలేదు. ఆయన చాలా రోజులు మాస్కు లేకుండా సంచరించారు. ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఆయన అభిమానులు కూడా మాస్కులు పెట్టుకోవడం మానేశారు. ఒక దశలో బ్రెజిల్‌ న్యాయమూర్తి ఒకరు ఆయనకు ఫైన్‌ వేస్తానని హెచ్చరించారు కూడా.  గతవారం ఆయన ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరి నిబంధనను రద్దు చేశారు. అదే రోజు ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ప్రకటించడంలో కూడా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించారు. విలేకర్లను పిలిచి కొంచెం దూరం జరిగి తన ఫేస్‌ మాస్క్‌ తీసి కరోనా సోకిన విషయాన్ని వెల్లడించారు. దీంతో విలేకర్లు హడలిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని