క్రీ.పూ. చైనా వాళ్లు అక్కడ చేపలు పట్టారట..!

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా డ్రాగన్‌ మధ్య వివాదాల సుడిగుండం తీవ్రమైంది. ఇటీవల  అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ హక్కును దక్షిణ చైనా సముద్రంలో అమెరికా వాడుకోవడం మొదలుపెట్టింది.

Updated : 14 Jul 2020 13:42 IST

 అందుకే అది వాళ్లదట..!
 సముద్రాన్ని మింగేస్తున్న డ్రాగన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, డ్రాగన్‌ మధ్య వివాదాల సుడిగుండం మరింత తీవ్రమైంది. ఇటీవల అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ హక్కును దక్షిణ చైనా సముద్రంలో అమెరికా వాడుకోవడం మొదలుపెట్టింది. తాజాగా ఇది ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మేము దయ తలిస్తేనే అమెరికా ఇక్కడికి రాగలిగింది.. మా దగ్గర యుద్ధనౌక విధ్వంసక క్షిపణులు ఉన్నాయని గ్లోబల్‌ టైమ్స్‌ నోరుపారేసుకుంది. మరోపక్క అమెరికా కూడా చైనాపై విరుచుకుపడింది.  ఈ ప్రదేశంలో చైనా ఇతర దేశాలను వేధించడం తప్పని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వివాదం తీవ్రమవుతోంది. 

దక్షిణ చైనా సముద్రంపై ఎందుకాసక్తి..? 

దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌, వియత్నాం, తైవాన్‌, బ్రునై, మలేషియా వంటి దేశాలున్నాయి. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం తీరం నుంచి 12 నాటికల్‌ మైళ్ల వరకు మాత్రమే ఆయా దేశాల తీర ప్రాంతాల కిందకు వస్తాయి. తీరం నుంచి 200 నాటికల్‌ మైళ్ల దూరం వరకు ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ కిందకు వెళతాయి. అంటే సముద్రం మధ్యలో ఒక దీవి ఉంటే ఆ దీవి చుట్టూ 200 నాటికల్‌ మైళ్ల దూరం ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ ఆ దేశానికి దక్కుతుంది. కొన్ని దశాబ్దాల క్రితం డ్రాగన్‌  దక్షిణ చైనా సముద్రంలో సర్వే జరిపితే భారీగా చమురు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. దీంతో వీటిని సొంతం చేసుకోవడం కోసం రకరకాల ఉపాయాలు ఆలోచిస్తోంది. ఈ సముద్రంలోని చాలా దీవులు తనవే అని చెబుతోంది. వీటికి రకరకాల వాదనలు తెస్తోంది.  వీటిల్లో స్పార్ట్‌లీ దీవులు కీలకమైనవి. వీటిని దక్కించుకోవడానికి చైనా ఏకంగా ఒక దీవిని కృత్రిమంగా విస్తరించి అక్కడ తన యుద్ధవిమానాలను మోహరించింది. దీంతో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.  ఈ దీవుల్లో క్రీస్తు పూర్వం 200 సమయంలో చైనా ప్రజలు ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చేవారని అందుకే ఇది తమదని పేర్కొంటోంది. అప్పట్లో హాన్‌ వంశం దీనిని కొనుగొందని చెబుతోంది. వాస్తవానికి 1877లో బ్రిటన్‌ దీనిని కనుగొంది.  

గల్వాన్‌ సమయంలో అమెరికా మోహరింపు..

గల్వాన్‌ లోయలో భారత్‌తో కయ్యానికి దిగిన సమయంలో అమెరికా ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ కోసం తన యుద్ధనౌకలను దక్షిణ చైనా సముద్రం వైపు మళ్లించింది. రెండు  విమాన వాహక నౌకలు, నాలుగు యుద్ధనౌకలను ఇక్కడకు తరలించింది. దీంతో చైనాపై ఒత్తిడి పెరిగిపోయింది.  వాస్తవానికి అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ పేరిట అమెరికా యుద్ధవిన్యాసాలు నిర్వహించడం జరుగుతూనే ఉంటుంది. సమీప దేశాలు ఆయా జలాల్లో వేధింపులకు పాల్పడకుండా వీటిని నిర్వహిస్తుంది. ఇటీవలే వీటిని నిర్వహించింది. దీనిపై చైనా మౌత్‌పీస్‌ గ్లోబల్‌ టైమ్స్‌ స్పందిస్తూ తాము అనుకుంటేనే అమెరికా అక్కడికి రాగలదని పేర్కొంది. తమ వద్ద డీఎఫ్‌ 21, 26 యుద్ధనౌక విధ్వంసక క్షిపణులు ఉన్నాయని పేర్కొంది.  2019లో ఇక్కడ చైనా-అమెరికా నౌకలు ఒక సందర్భంలో దాదాపు ఢీకొన్నంత పనిచేశాయి. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.  తాజాగా మరోవైపు భారత్‌ కూడా  మలబార్‌ యుద్ధవిన్యాసాలకు సన్నాహాలు చేసుకుంటుండటంతో  చైనాపై ఒత్తిడి పెరిగిపోయింది. గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌ పరోక్షంగా కూడా తనకు వ్యతిరేకంగా పనిచేయకూడదని చైనా భావించింది. కానీ, ఇది బెడిసికొట్టింది. 

ఆజ్యం పోసిన మైక్‌ పాంపియో ప్రకటన..

తాజా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ ‘దక్షిణ చైనా సముద్రంలో పట్టుకోసం ఇతరులను డ్రాగన్‌ వేధించడం తప్పు. పూర్తిగా అన్యాయం. అంతర్జాతీయ చట్టాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తోంది. ఈ జలాల్లో వేధింపులు, పెట్రోలియం అన్వేషణ పూర్తిగా అంతర్జాతీయంగా చట్టవ్యతిరేకం. దీనిని ప్రపంచం చూస్తూ ఊరుకోదు’ అని పేర్కొన్నారు. మరోపక్క చైనా మాత్రం అమెరికా అకారణంగా ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. ఆ వాదనకు ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని