దుబే ఎన్‌కౌంటర్‌:  దిశ కేస్‌లో చేసినట్టే చేద్దామా!

ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌, ఎనిమిది పోలీసులపై అతడి కాల్పుల ఘటనలపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్‌, హత్యలపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో విచారణకు...

Updated : 15 Jul 2020 10:29 IST

యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌, ఎనిమిది పోలీసులపై అతడి కాల్పుల ఘటనలపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్‌, హత్యలపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో విచారణకు ఆదేశించాలని కొందరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది.

విచారణలో భాగంగా ఎలాంటి కమిటీ కావాలో చెప్పాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సమాధానం చెప్పేందుకు గురువారం వరకు గడువు ఇచ్చింది. విచారణను జులై 20కి వాయిదా వేసింది. ‘తెలంగాణ కేసులో (పశువైద్యురాలి నిందితుల ఎన్‌కౌంటర్‌) చేసినట్టే చేస్తాం. ఎలాంటి కమిటీ కావాలో చెప్పండి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే అన్నారు. కాగా ప్రభుత్వ స్పందన తెలిపేందుకు కాస్త సమయం ఇవ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టును కోరారు. ‘దయచేసి కొంత సమయం ఇవ్వండి. యూపీ ప్రభుత్వం నుంచి నిజానిజాలు కనుగొని మీ ముందు ఉంచుతాను’ అని తెలిపారు.

అరెస్టు చేసేందుకు వెళ్లిన ఎనిమిది మంది పోలీసులను తన అనుచరులతో కలిసి వికాస్‌ దుబే చంపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా అతడు పరారయ్యారు. పోలీసులు భారీయెత్తున గాలించి అతడి అనుచరులను మట్టుపెట్టారు. చివరికి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లోని ఓ ఆలయంలో దుబే పట్టుబడ్డాడు. తిరిగి ఉత్తర్‌ప్రదేశ్‌ తీసుకెళ్తుండగా తమపై ఎదురు తిరిగి పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇక హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఓ యువ పశువైద్యురాలిని కర్కశంగా అత్యాచారం చేసి హత్యచేసిన నిందితులను పోలీసులు అదే చోట ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని