ట్రంప్‌ ఎంతో చేశారు

గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు చేయని విధంగా భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకొనేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎంతో కృషి చేశారని శ్వేతసౌధం పేర్కొంది. భవిష్యత్తులోనూ రెండు దేశాల మధ్య కీలక ...

Updated : 29 Feb 2024 17:30 IST

వాషింగ్టన్‌: గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు చేయని విధంగా భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకొనేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎంతో కృషి చేశారని శ్వేతసౌధం పేర్కొంది. భవిష్యత్తులోనూ రెండు దేశాల మధ్య కీలక భాగస్వామ్యాలను ఆయన కొనసాగిస్తారని చెప్పింది. ఈ మేరకు శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలి సీనియర్‌ అధికారి పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘మానవరహిత సాయిధ విహంగ నిఘా వ్యవస్థ(ఎంక్యూ-9)ను అమెరికా నుంచి పొందుతున్న తొలి ఒప్పందేతర మిత్రదేశంగా భారత్‌ ఉందంటే అందుకు ట్రంపే కారణం. ఫిబ్రవరి 24-26 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల మధ్య బంధాన్ని సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచారు. ట్రంప్‌ 2017లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యాక శ్వేతసౌధాన్ని మొదటగా సందర్శించిన నాయకుల్లో మోదీ ఉన్నారు. 2019 సెప్టెంబరులో హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో 55 వేల మంది పాల్గొన్నారు. 2020లో అహ్మదాబాద్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో 1.1 లక్షల మంది భారతీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలతో రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. రక్షణ, భద్రత సహకారంలో పరస్పర ప్రయోజనాల కోసం దృఢమైన భాగస్వామ్యానికి ట్రంప్‌ కృషి చేశారు. భారత్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న రెండో అతిపెద్ద దేశంగా అమెరికా ఉంది. 3 బిలియన్‌ డాలర్ల మేర రక్షణ కొనుగోళ్లు జరిగాయి.’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని