
అవును.. గాంధీజీ పూరీని దర్శించారు!
మందిర పూజారి వద్ద లభించిన వందేళ్ల నాటి లేఖ
రాయగడ పట్టణం, న్యూస్టుడే: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రాన్ని జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితంలో దర్శించి ఉండకపోవచ్చని చరిత్రకారులు చెబుతుంటారు. మందిరంలో హరిజనుల ప్రవేశానికి అప్పట్లో ఉన్న ఆంక్షల కారణంగా గాంధీజీ జగన్నాథుని దర్శనానికి రాలేదని భావిస్తుంటారు. అయితే, ఈ వాదనకు తెరదించుతూ దేవదేవున్ని కుటుంబ సమేతంగా గాంధీ దర్శించుకున్నట్లు మందిర పూజారి వద్ద వందేళ్ల నాటి లేఖ తాజాగా బయటపడింది. గుజరాతీ పూజారికి చెందిన భక్తుల రిజిస్టరులో పూరీ మందిర దర్శన అనుభవాలను గాంధీజీ గుజరాతీ భాషలో పొందుపరిచినట్లు ఆ లేఖ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం శ్రీక్షేత్రంలో సేవలందిస్తున్న గుజరాతీ పూజారి రఘునాథ్ గోచ్చికర్ వెలుగులోకి తెచ్చిన ఈ లేఖ ప్రకారం.. 1921 మార్చి 27 ఆదివారం నాడు గాంధీజీ, తన భార్య కస్తూరీబా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీమందిరాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుత పూజారి రఘునాథ్ తాత గోపినాథ్ గోచ్చికర్ గాంధీని మందిరం లోపలికి తీసుకెళ్లారు. గోపురం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత మందిరం లోపల జగన్నాథుని ముందు గాంధీజీ మోకరిల్లి నమస్కరించారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల దర్శనంతో పరవశించిపోయారు. ఆలయ వాతావరణం, పరిసరాలను ప్రశంసిస్తూ లేఖలో రాశారు అని రఘునాథ్ వివరించారు. బాపూజీ స్వాతంత్య్రోద్యమ కాలంలో ఒడిశా రాష్ట్రానికి 8 సార్లు వచ్చినప్పటికీ 1921లో ఒక్కసారి మాత్రమే శ్రీ మందిరాన్ని దర్శించుకున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.