రెమ్‌డెసివిర్‌పై ‘మహా’ జగడం

కరోనా చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ సేకరణ విషయంలో మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్షాల మధ్య జగడం రేగింది.

Updated : 19 Apr 2021 08:00 IST

బ్రూక్‌ ఫార్మా కంపెనీపై ముంబయి పోలీసుల విచారణ
నిషేధమున్నా ఎగుమతులు చేస్తున్నారంటూ ప్రశ్నలు
కంపెనీకి అండగా పోలీసుస్టేషన్‌కు వచ్చిన భాజపా నేతలు

ముంబయి: కరోనా చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ సేకరణ విషయంలో మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్షాల మధ్య జగడం రేగింది. రెమ్‌డెసివిర్‌ ఎగుమతుల్ని ఇప్పటికే కేంద్రం నిషేధించగా.. దమణ్‌ కేంద్రంగా పనిచేసే బ్రూక్‌ ఫార్మా మాత్రం విదేశాలకు పంపుతోందన్న సమాచారంతో ముంబయి పోలీసులు రంగంలోకి దిగారు. ఆ సంస్థ డైరెక్టర్‌ రాజేశ్‌ డొకానియాను శనివారం రాత్రి విల్లే పార్లే పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. కనీసం 60 వేల వయల్స్‌ను విమానంలో తరలించినట్టు తమకు సమాచారం ఉందంటూ ప్రశ్నించారు. డొకానియాను విచారిస్తున్నారని తెలిసి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, భాజపా రాష్ట్ర నేత ప్రవీణ్‌ ధరేకర్‌ తదితరులు హుటాహుటిన పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత దృష్ట్యా తమ విజ్ఞప్తి మేరకే ఆ నిల్వలు సిద్ధం చేశారన్నారు. కక్షతోనే కంపెనీ డైరెక్టర్‌ను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

వాళ్లెలా సేకరిస్తారు?
భాజపా నేతల వైఖరి వింతగా ఉందంటూ రాష్ట్ర మంత్రి జయంత్‌ పాటిల్‌ మండిపడ్డారు. విధిగా ప్రభుత్వానికే ఇవ్వాల్సిన ఔషధాలను.. ప్రతిపక్ష నేతలు/ప్రైవేటు వ్యక్తులు ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు.   ‘‘రూ.4.75 కోట్ల విలువైన అత్యవసర మందుల్ని తీసుకెళ్లి భాజపా పార్టీ కార్యాలయంలో పంచుతారా? ఎగుమతుల విషయమై పోలీసులు ప్రశ్నిస్తుంటే.. ఫార్మా కంపెనీకి లాయర్ల మాదిరిగా భాజపా నేతలు పోలీసుస్టేషన్‌కు పరిగెత్తాల్సిన అవసరం ఏముంది’’ అంటూ మరో మంత్రి నవాబ్‌ మాలిక్‌ మండిపడ్డారు. భాజపా వైఖరిని కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు తప్పుబట్టాయి. భాజపా నేతలు ముంబయి పోలీసుల విధుల్లో కావాలనే జోక్యం చేసుకుంటున్నారని హోం మంత్రి దిలీప్‌ పాటిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మంత్రులకు రాజకీయాలే తప్ప కరోనా రోగుల ఇబ్బందులు పట్టడం లేదని ఫడణవీస్‌ అన్నారు.

గుజరాత్‌లో అరెస్టు

బ్రూక్‌ కంపెనీలో తయారైన రెమ్‌డెసివిర్‌ను గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లాలో బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కొద్ది మొత్తంలో ఔషధాలు స్వాధీనం చేసుకున్నట్టు ఆదివారం తెలిపారు. వీరిలో ఒకరు బ్రూక్‌ ఫార్మాలో టెక్నికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోనూ రెమ్‌డెసివిర్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్న ఓ వైద్యుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు