Updated : 26 Apr 2021 09:58 IST

మాటలు తక్కువ.. పనెక్కువ

ఆర్భాటాలకు అతీతం - కరోనా నివారణపైనే బైడెన్‌ దృష్టి 
వంద రోజుల పాలన పూర్తి దిశగా అగ్రరాజ్యాధిపతి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కోటు జేబులో చిన్న కార్డు ఉంటుంది. దాన్ని నిత్యం ఆయన చూసుకుంటుంటారు. దాంట్లో ఆ రోజు కార్యక్రమాల వివరాలతో పాటు, కరోనా తాజా పరిస్థితి ఉంటుంది. ఎన్ని కేసులు వచ్చాయి, ఎందరు చనిపోయారు, ఎంతమంది కోలుకున్నారు...మొదలైన సమాచారమంతా ఉంటుంది. కరోనా నివారణకు ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. మహమ్మారిని అరికట్టడమే తన తొలి ప్రాధాన్యమని ఎన్నికల సమయంలో చెప్పిన బైడెన్‌ అందుకు అనుగుణంగానే కార్యాచరణ చేపట్టారు. వంద రోజుల్లో 10 కోట్ల మందికి టీకాలు వేయాలని తొలుత లక్ష్యం పెట్టుకోగా, 90 రోజుల్లోనే 20 కోట్ల మందికి వేసి రికార్డును సృష్టించారు. ఎలాంటి ఆర్భాటమూ, హడావుడి లేకుండా లక్ష్యాన్ని అధిగమించారు. అందుకే ఆయన తొలి వంద రోజుల పాలనను ‘మాటలు తక్కువ- పని ఎక్కువ’గా పలువురు అభివర్ణిస్తున్నారు.

మౌనంగా అడుగులు..

78 ఏళ్ల వయసులో అధ్యక్ష పదవిని చేపట్టిన బైడెన్‌ ఈ నెల 30 నాటికి 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్నారు. తొలి వంద రోజులు ఆయనకు అంత సంతోషకరమైనవేమీ కావు. అసలు ఆయన ఎన్నికను ఆమోదించడానికే మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నో ఇబ్బందులు పెట్టారు. దానికి తోడు కరోనా సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వీటన్నింటినీ మౌనంగానే దాటుకొని దేశ ప్రజల్లో విశ్వాసం నింపారు. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం ద్వారా అభివృద్ధికి దోహదం చేశారు. గందరగోళం లేకుండా అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని అమెరికన్లు భావిస్తున్నారు. ట్రంప్‌ మాదిరిగా సమావేశాల్లో పాల్గొనడం లేదు. కరోనా కూడా ఇందుకు కారణం కావొచ్చు. ట్వీట్లు, విలేకరుల సమావేశాలు తక్కువే. సమయమంతా హామీల అమలుకే కేటాయిస్తున్నారు. నిజానికైతే ఎన్నికల్లో చెప్పినదానికన్నా ఎక్కువే చేస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. వర్ణ వివక్ష రూపుమాపడంలో భాగంగా ఆఫ్రికన్‌-అమెరికన్లు ఉండే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు.

భారత్‌కు మిగులు టీకాలు ఎందుకివ్వరు?

కరోనా సమయంలో భారత్‌కు అండగా నిలవకపోవడంపై మాత్రం బైడెన్‌ను సొంత పార్టీవారే విమర్శిస్తున్నారు. మిగులు టీకాలను భారత్‌కు సహాయంగా ఎందుకు ఇవ్వరని డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ప్రశ్నించారు. భారత్‌తో పాటు అర్జెంటీనా, ఇతర దేశాలకు ఆస్టాజ్రెనెకా వ్యాక్సిన్‌లు పంపించాలని కోరారు.  వారికి అందాల్సిన సమయంలో వాటిని గిడ్డంగుల్లో దాచకూడదని అన్నారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని