Updated : 01 May 2021 08:54 IST

Vaccine: రెండో డోసు ఆలస్యమైనా గాబరా పడొద్దు

వ్యాక్సిన్‌ పనిచేస్తుంది

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌

ఈనాడు, దిల్లీ: కరోనా టీకా రెండో డోసు తీసుకోవడం కాస్త ఆలస్యమైనా గాబరా పడొద్దని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. ఆలస్యమైనా అది పనిచేస్తుందని, ఎవరూ మానొద్దని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘కొవిడ్‌ వచ్చి తగ్గినవారు రెండు వారాల తర్వాతే వ్యాక్సిన్‌ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. మెజార్టీ వైద్యులు మాత్రం లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిన తర్వాత 4-6 వారాల్లో తీసుకోవచ్చని చెబుతున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక టీకా వేయించుకోవడం తప్పనిసరి. రెండో డోసు కొన్ని వారాలు ఆలస్యమైతే వ్యాక్సిన్‌ పనిచేయదని అనుకోవద్దు. ఆలస్యమైనా రెండో డోసు తీసుకుంటే బూస్టర్‌ ఎఫెక్ట్‌ ఇస్తుంది. ప్రస్తుతం వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో వైద్య వసతులపై ఒత్తిడి పెరిగింది. ఒకరోగి ఆక్సిజన్‌ కోసం ఆసుపత్రిలో చేరితే పదిరోజుల వరకూ అక్కడే ఉండాలి. కానీ బయట పడకల కోసం నిరీక్షిస్తున్నవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఇప్పుడు మహమ్మారి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు వ్యాపిస్తోంది. 
దశను బట్టి మందులు వాడాలి...
కొవిడ్‌లో రెండు దశలున్నాయి. ఏ దశలో వాడాల్సిన మందులు ఆ దశలోనే వాడాలి. అదే సమయంలో మందుల దుర్వినియోగాన్ని పరిహరించాలి. మొదటి దశలో వైరస్‌ శరీరంలో విస్తరించి దగ్గు, జ్వరం, జలుబు వస్తాయి. లక్షణాలకు అనుగుణం ఇచ్చే చికిత్సతో చాలామంది కోలుకుంటారు. కొందరిలో వైరస్‌ ఊపిరితిత్తుల్లో ఎక్కువ వ్యాపిస్తుంది. అలాంటి వారిని రెండోదశ రోగులుగా గుర్తించి ఆసుపత్రుల్లో చేర్పించాలి. వారికి రెమ్‌డెసివిర్, ప్లాస్మా ఇస్తుంటారు. రెండో దశలో వైరస్‌ లోడు ఎక్కువగా లేకపోయినా, రోగనిరోధకశక్తి అస్తవ్యస్తంగా మారొచ్చు. అప్పుడు స్టెరాయిడ్స్, ఇతర మందుల అవసరం ఉంటుంది. మొదటి దశలో స్టెరాయిడ్స్‌ ఇవ్వడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి... ఏ దశలో ఎలాంటి చికిత్స అందించాలన్న విషయమై గ్రామీణ వైద్యులకు మార్గదర్శకాలు పంపుతున్నాం. ఆసుపత్రుల్లో వసతులను పెంచుకుంటూనే కేసులను తగ్గించుకోవాల్సి ఉంది. ఇందుకోసం ‘బ్రేక్‌ ద చైన్‌’ ఉద్యమాన్ని మొదలుపెట్టాలి’’ అని ఆయన సూచించారు.
కొన్ని రాష్ట్రాల్లో మూడోదశ టీకా పంపిణీ: లవ్‌ అగర్వాల్‌
ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్‌ డోసులు కొనుగోలుచేసిన కొన్ని రాష్ట్రాల్లో... మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవారికి టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని వైద్యఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. తొలుత కొన్నిచోట్ల ప్రారంభమైనా, తర్వాత విస్తరిస్తుందన్నారు. ‘‘కేంద్రం ఇప్పటివరకు 15 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేసింది. 45 ఏళ్లు దాటినవారికి ఇకపైనా ఉచితంగానే అందిస్తుంది’’ అని ఆయన చెప్పారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని