Covid ఒకసారి సోకినవారికి.. FirstDoseతోనే జోష్‌!

గతంలో ఒకసారి కొవిడ్‌-19 బారినపడినవారికి మొదటి డోసు టీకాను ఇస్తే కరోనా వైరస్‌కు సంబంధించిన

Updated : 04 May 2021 12:39 IST

 కరోనా కొత్త రకాల నుంచీ మెరుగైన రక్షణ 

 బ్రిటన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

దిల్లీ: గతంలో ఒకసారి కొవిడ్‌-19 బారినపడినవారికి మొదటి డోసు టీకాను ఇస్తే కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని వేరియంట్ల నుంచి రక్షణ లభిస్తుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా రకాలపై పరిశీలన జరిపినప్పుడు ఈ విషయం తేలిందని వారు చెప్పారు. అయితే విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న బ్రెజిల్‌ (పి.1), భారత్‌ (బి.1.617), (బి.1.618) రకాలకూ ఇది వర్తించొచ్చని పేర్కొన్నారు. ఇంతకుముందు కరోనా సోకనివారు మొదటి డోసు టీకాను తీసుకున్నప్పుడు సంబంధిత వైరస్‌ రకాలను ఎదుర్కొనేలా సరిపడా రోగనిరోధక స్పందన వెలువడకపోవచ్చని వివరించారు.

ఇంపీరియల్‌ కాలేజీ లండన్, క్వీన్‌ మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్, యూనివర్సిటీ కాలేజీ లండన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. వీరు ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ టీకాకు సంబంధించిన మొదటి డోసు పొందిన ఆరోగ్య కార్యకర్తల రక్త నమూనాలను విశ్లేషించారు. కరోనాకు సంబంధించిన మూల వైరస్, బ్రిటన్‌ (బి.1.1.7), దక్షిణాఫ్రికా (బి.1.351) రకాల నుంచి వీరిలో ఏ స్థాయిలో రక్షణ లభిస్తుందన్నది పరిశీలించారు. వైరస్‌ను ‘గుర్తుంచుకొనే’ బి-కణాలు; కరోనా వైరస్‌ బారినపడ్డ  కణాలను గుర్తించి, నాశనం చేయడంలో బి కణ జ్ఞాపకశక్తికి సాయపడే ‘టి’ కణాలపై ప్రధానంగా దృష్టి సారించారు. గతంలో స్వల్పస్థాయి లేదా అసింప్టమాటిక్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినవారికి మొదటి డోసు ఇచ్చినప్పుడు టి, బి కణాలు, వైరస్‌ నిర్వీర్యక యాంటీబాడీ స్పందన పెరిగాయని గుర్తించారు. మూల కరోనా వైరస్‌తోపాటు బ్రిటన్, దక్షిణాఫ్రికా రకాల నుంచి సమర్థంగా రక్షణ కల్పించే స్థాయిలో ఇవి ఉన్నాయని చెప్పారు. అందుకుభిన్నంగా.. గతంలో కొవిడ్‌ సోకని వారిలో మొదటి డోసు వల్ల యాంటీబాడీల స్పందన చాలా తక్కువ స్థాయిలో ఉందని గుర్తించారు. కరోనా వైరస్‌కు సంబంధించిన వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే స్థాయిలో అవి లేవని చెప్పారు. ఇలాంటివారు రెండో డోసును పొందాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తోందన్నారు. దీనికితోడు ఒకసారి ఇన్‌ఫెక్షన్‌ సోకడం వల్ల కరోనాకు సంబంధించిన కొత్త రకాల నుంచి భవిష్యత్‌లో పూర్తిస్థాయి రక్షణ లభించదని కూడా వెల్లడైనట్లు వివరించారు. అందువల్ల టీకాలు పొందడం తప్పనిసరని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని