Corona: జంతువుల ద్వారా కరోనా సోకదు

కరోనా వైరస్‌ మనుషుల నుంచి మనుషులకే సోకుతుంది తప్ప...

Updated : 06 May 2021 12:12 IST

నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ 

దిల్లీ: కరోనా వైరస్‌ మనుషుల నుంచి మనుషులకే సోకుతుంది తప్ప... జంతువుల ద్వారా సోకదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. వైరస్‌ తొలిసారి విజృంభించిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రజల్లో రోగనిరోధక శక్తి తక్కువ కావడం వల్లే... మహమ్మారి రెండో దశ అనివార్యమైందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో పలు సింహాలు కరోనా బారిన పడ్డాయన్న వార్తల నేపథ్యంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వీకే పాల్‌ బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘కరోనా మనిషి నుంచి మనిషికి మాత్రమే సోకుతుంది. వ్యాక్సిన్లు వేయించుకున్న వారందరిలోనూ జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి ప్రభావాలు కనిపించవు. టీకా వేయించుకున్న తర్వాత ఎలాంటి ప్రభావాలూ లేకపోతే సాధారణంగానే పనులు చేసుకోవచ్చు. మాస్కు ధరించడం, దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండటం, ఇళ్లకే పరిమితమవడం వంటి జాగ్రత్తలను అందరూ పాటించాలి. ఇళ్లలోనే ఉంటూ కొవిడ్‌పై పోరాటం సాగిస్తున్నవారికి వైద్య సమాజం అండగా ఉండాలి’’ అని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని