Corona: ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తారా?

కరోనా ఔషధాలకు తీవ్ర కొరత ఉన్న సమయంలో కొందరు రాజకీయ నాయకులు వాటిని సమకూర్చుకొని

Updated : 18 May 2021 10:24 IST

ప్రాణాధార మందుల నిల్వ, పంపిణీపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం
వాటిని ప్రభుత్వానికి అప్పగించాలని సూచన

దిల్లీ: కరోనా ఔషధాలకు తీవ్ర కొరత ఉన్న సమయంలో కొందరు రాజకీయ నాయకులు వాటిని సమకూర్చుకొని నిల్వ చేయడంపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాణాధారమైన మందులను ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌(డీజీహెచ్‌ఎస్‌)కు వెంటనే అప్పగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో దిల్లీ పోలీసులు సమర్పించిన దర్యాప్తు నివేదిక అస్పష్టంగా, కప్పిపుచ్చే విధంగా ఉందని జస్టిస్‌ విపిన్‌ సంఘి, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న కేసును దర్యాప్తు చేయబోమంటే అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎంపీ గౌతం గంభీర్‌(భాజపా), దిల్లీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు చౌధరీ అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ముఖేశ్‌ శర్మ(కాంగ్రెస్‌), భాజపా అధికార ప్రతినిధి హరీశ్‌ ఖురానా, ఆప్‌ ఎమ్మెల్యే దిలీప్‌ పాండే, అఖిలభారత యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ తదితరులను ప్రశ్నించామని, వీరందరూ ప్రజలకు స్వచ్ఛందంగా సహాయపడే ఉద్దేశంతోనే మందులు, ఆక్సిజన్, వైద్య పరికరాలను సేకరించారని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. దర్యాప్తు ముగించడానికి ఆరు వారాల గడువివ్వాలని పోలీసులు కోరగా ధర్మాసనం తిరస్కరించింది. మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొనేందుకు పెద్ద మొత్తంలో ఔషధాలు, వైద్య పరికరాలు సేకరించి పంపిణీ చేస్తామనడం సమర్థనీయం కాదని పేర్కొంది. వీరి చర్యల వల్ల వ్యాధిగ్రస్తులు నల్లబజారులో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని తెలిపింది. దీనికి బాధ్యులను గుర్తించాలని, వారంలో నివేదిక సమర్పించాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఔషధాలు నిల్వ చేయడం రాజకీయ నాయకుల పని కాదని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ హేతుబద్ధంగా నడుచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ నాయకులు ప్రాణాధార ఔషధాలను నిల్వచేయడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో దిల్లీ డ్రగ్‌ కంట్రోలర్‌ను కూడా ప్రతివాదిగా చేర్చుతూ నోటీసు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని