Corona: పిల్లలకు సోకినా తీవ్ర లక్షణాలు ఉండవు

చిన్నపిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్ర లక్షణాలు ఉండవని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పేర్కొన్నారు. పిల్లల్లో పెద్ద లక్షణాలు ఉండవు కాబట్టి వారికి సాధారణ చికిత్స సరిపోతుందన్నారు.

Updated : 19 May 2021 11:24 IST

నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: చిన్నపిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్ర లక్షణాలు ఉండవని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పేర్కొన్నారు. పిల్లల్లో పెద్ద లక్షణాలు ఉండవు కాబట్టి వారికి సాధారణ చికిత్స సరిపోతుందన్నారు. అయితే వైరస్‌ తన స్వభావాన్ని మార్చుకుంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని, అందువల్ల దానిపై కన్నేసి ఉంచాలన్నారు. తాము ఇప్పుడు అదే పనిలో ఉన్నామని.. వైరస్‌లోని మార్పులను అర్థం చేసుకొని ఎలా స్పందించాలో అలా స్పందిస్తామని పేర్కొన్నారు. సింగపూర్‌ వైరస్‌ రకం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, మూడో ఉద్ధృతి రూపంలో అది భారత్‌ను తాకొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘పసి పిల్లలకు వైరస్‌ సోకినప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. వయసు పెరిగేకొద్దీ లక్షణాలు పెరుగుతూపోతాయి. వయసు తక్కువ ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్‌ సోకినా.. అది ఉన్నట్లే తెలియదు. వయసు తగ్గేకొద్దీ లక్షణాలు తక్కువైపోతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే సరళి ఉంది. డిసెంబరులో 10 ఏళ్లలోపు వారిపై సర్వే చేసినప్పుడు పెద్దల్లో ఎంత మేర జీరో పాజిటివిటీ రేటు కనిపించిందో పిల్లల్లోనూ అంతే కనిపించింది. దీన్నిబట్టి పిల్లలకూ ఇది సోకుతోంది కానీ లక్షణాలు కనిపించడం లేదు.   పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చాం. 10-15రోజుల్లో ఈ ప్రయోగాలు ప్రారంభమవుతాయి. మేం ఇంకా సింగపూర్‌ రకం వైరస్‌పై అధ్యయనం చేయలేదు. అధికారిక సమాచారం అందిన అనంతరం పరిశీలించి స్పందిస్తాం’’ అని వీకే పాల్‌ పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని